Thursday 20 April 2023

శ్రీదత్త పురాణము (114)

 


సకల భువనాలకు ఆశ్రయుడైన పరమాత్మ లీలావిగ్రహ శరీరుడై దత్తాత్రేయుడుగా అవతరించి లోకానికి సదాచారం నేర్పటం కోసం తానుగా (శేచాచార) ఆచారవిధుల్ని పాటించాడు. స్నానసంధ్యలూ, దానధర్మాలు, భిక్షాటనం, ఉపవాసం, యోగాభ్యాసం, వనవాసం, గుహానివాసం, అశ్వత్థవృక్ష ఛాయానివాసం, ఆశ్రమవాసం, గ్రామపర్యటనలు, నగర పర్యటనలు, ధ్యాన పరత్వం, మౌనస్వీకారం, దివ్యాంబరధారణ, దిగంబరస్థితి, నానాలంకార ధారణ, వీరలంకార స్థితి, రధ - గజ - తురంగ యానం - పాదయాత్ర అన్నింటినీ ఆచరించాడు. ఈ లోకాన్ని ఒక్కొక్కప్పుడు ప్రశంసించాడు. ఒక్కొక్కప్పుడు కర్మ నిర్మితంగదా, అని విమర్శించాడు, నిందించాడు. ఒకప్పుడు దివ్యాంగనారతుడయ్యాడు. మరొకప్పుడు నిరక్తుడయ్యాడు, మద్యమాంసప్రియుడుగా ఒకప్పుడు, శుద్ధ సత్వనిధిగా మరొకప్పుడు, శివలింగార్చనాపరుడుగా హరిసేవాపరాయణుగా మరొకప్పుడు, శక్తినిష్టుడుగా ఒకప్పుడూ, గణపతి ఉపాసకుడుగా ఒకప్పుడు, సౌరసాంప్రదాయిగా, హయగ్రీవోపాసకుడుగా, శివలింగ ప్రతిష్టాపనకర్తగా, కాశీలో పార్వతీ పరమేశ్వరులను అర్చిస్తూ ఒకప్పుడూ - ఇలా లోకానికి విభిన్న దేవతామూర్తుల ఉపాసనా విధానాన్ని స్వయంగా ఉపదేశించాడు.


దత్తాత్రేయుడు ఒకానొకప్పుడు కాశీలో విశ్వేశ్వరుడికి దక్షిణంగా, త్రిపురాంతకలింగానికి పశ్చిమంగా, తానొక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దానికి ఎదురుగా కూర్చుని యోగనిష్టతో శివధ్యానం చేసాడు. అది ఇప్పటికీ చాలా పవిత్రమైన చోటు. దీన్నే "దత్తాత్రేయతీర్థము" అంటారు. అక్కడ స్నానం చేసినా, ధ్యానం చేసినా, భక్తుల సంసార రోగ సంబంధ దుఃఖాలన్నీ క్షణంలో తొలగిస్తానని దత్తాత్రేయుడే స్వయంగా ప్రకటించాడు. అక్కడ దత్త ప్రతిష్ఠితా లింగం సకల శ్రేయస్సులు నేటికీ అందిస్తుంది. వేదధర్ముడు దీపకునికి చెబుతున్నట్టుగా బ్రహ్మదేవుడు కలికి చెబుతున్న దత్తమహిమలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు గదా అని సూతమహర్షి శౌనకాదిమునులను ఒకసారి హెచ్చరించి అందరూ శ్రద్ధతో వింటున్న సంగతి గమనించి సంతృప్తి చెందాడు. 


సూతమహర్షి నీ ఋణం తీర్చుకోలేం భవరోగాలకు దివ్యఔషధం లాంటి దత్తమహిమలు చెప్తున్నావు. దీపకుడు ఆపైన గురువైన వేద ధర్ముణ్ణి ఏమి అడిగాడు? మహాతపస్వులకు సైతం ఆదర్శప్రాయుడైన వేదధర్ముడు ఏమి చెప్పాడు? అది అంతా మాకు సవిస్తరంగా తెలియజేయ్యి- లీలా మునికుమారుడైన దత్తగాధలు, చెబుతున్నవారిని వింటున్న వారినీ శుద్ధిపరుస్తాయి. మహాయోగ ఫలాలు అందిస్తాయి. వర్ణాశ్రమధర్మాలను అతిక్రమించిన వారికి సైతం పుణ్యఫలం అందిస్తాయి అంటే ఇక మనవంటివారికి ఇంకా అధిక పుణ్యఫలాన్ని అందిస్తాయి. అందుచేత సూతమహర్షి! మిగతా వివరాలన్నీ మాకు వినిపించి పుణ్యం కట్టుకో అని శౌనకాదులు అభ్యర్థించారు. అప్పుడు సూతుడు ఇలా చెప్తున్నాడు.


No comments:

Post a Comment