Wednesday, 26 April 2023

శ్రీదత్త పురాణము (120)

 


స్వామీ నన్ను చాలాకాలంగా వేధిస్తున్న సంశయాలు కొన్ని ఉన్నాయి. వాటిని మీ ముందు ఉంచుతాను. అవి తొలగించి నాలో జ్ఞానకాంతులు నింపండి. సత్తూ, అసత్తూ, స్థూలమూ, సూక్ష్మము, కార్యము, కారణమూ, వ్యక్తమూ అవ్యక్తమూ- సమస్తము పరబ్రహ్మవైన నువ్వే కదా! అద్వితీయమూ, అవ్యయము, స్వయంప్రకాశమానమూ అయిన పరబ్రహ్మంలో నశ్వరమూ మాయా కల్పితమూ అనిత్యమూ అయిన ఈ విశ్వభ్రాంతి వల్ల అద్దంలో ప్రతిబింబంగా కనిపిస్తుంది అని వేదాంతులు అంటున్నారు. రజ్జు సర్పభ్రాంతి- శుక్తి రజతభ్రాంతి- ఇలాంటివి ఉదాహరణులుగా చూపిస్తున్నారు. మరికొందరు ఇదే వేదాన్ని ప్రమాణంగా చూపుతూ జగత్తు మిధ్య అయితే ఇంతకాలం స్పుటంగా కంటికి కనిపిస్తుందా? దీనికి బోధన కూడా లక్ష్యం కాదు. దీనికి ఆది ఎక్కడ? అంతమెక్కడ? ఒక్కటే ప్రవాహం అని వాదిస్తున్నారు. అది అద్వైతమూ ఇది ద్వైతము అంటున్నారు. ఇక మీమాంసకులు ధర్మమే పరమనీ జగత్తు నిత్యమూ సనాతనమూ అని శ్రుతుల్ని ప్రమాణంగా చూపించి మరి ప్రతిపాదిస్తున్నారు. సాంఖ్యులు సృష్టికి "ప్రధానం" కారణం అంటున్నారు. పురుషుడు నిమిత్తమాత్రడంటున్నారు. యోగులూ ఇదే నిజమని అంగీకరిస్తున్నారు. తార్కికుడు ప్రపంచాన్ని నిత్యమంటున్నారు. ఇవన్నీ వేదోక్తులు ప్రమాణంగా చూపుతున్న సిద్దాంతాలే. వాదాలే. వేదప్రామాణ్యాన్ని అంగీకరించని బుద్ధిమంతులు కొందరు వున్నారు. వీళ్ళల్లో కొందరు ప్రపంచాన్ని క్షణికం అంటున్నారు. ఇన్ని రకాల వాదాలు, భేదాలు ప్రపంచంలో కన్పిస్తూ, విన్పిస్తూ వుంటే వీటిలో దేన్నీ ప్రామాణికంగా స్వీకరించాలి అనేది ముముక్షువులకు పెద్ద సందేహం అవుతోంది. దేన్ని అనుసరిస్తే ఏ ప్రమాదం వచ్చిపడుతుందో ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వస్తుందో అని మల్లగుల్లాలు పడుతున్నారు. శ్రుతి, స్మృతి, పురాణేతి ఆగమశాస్త్రాలకు సమన్వయం కుదిర్చి పరస్పర వైరుద్ధ్యం తొలగించి ఏకవాక్యం బోధించగల గురుస్వామివి నువ్వే కాబట్టి ఈ సంశయం తీర్చి పరమపదమునకు దారి చూపించవలసిందిగా కోరుతున్నాను. ఏది మాకు ఆచరింపదగినదో ఏది వదిలెయ్యవలసినదో తేల్చి చెప్పప్రార్థన. ఇలాగే ఆచారాలలో కూడా తేడాలు వున్నాయి. సదాచారాలు ఏమిటో అనాచారాలు ఏమిటో తెలియక కొట్టుకుంటున్నాం. నువ్వు సర్వాచారనిధివని సర్వాచార ప్రవర్తకుడవనీ పండితులు చెబుతున్నారు. బహిర్ముఖంగా నవ్వు అనాచారుడువని కొందరు అంటున్నారు. ఇంతకీ నువ్వు ఆచారలభ్యుడవా? లేక అనాచారలభ్యుడవా? పనిలో పనిగా ఈ సంశయాన్ని కూడా తీర్చుభగవాన్! త్రిమూర్తులూ, పంచభూతాలూ సకల దేవతలు నువ్వేనని భుక్తి ముక్తి ఫలప్రదాతవైన నిన్ను బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు, ప్రజాపతులూ, మునీంద్రులూ ధ్యానిస్తూ వుంటారని మహర్షులు చెప్పగా విన్నాను. అటువంటి నువ్వు ఇలా రోజుల తరబడి ధ్యాననిష్టలో కూర్చుంటున్నావు. నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నట్టు? అందరికీ ధ్యేయుడవైన నీకు వేరే ధ్యేయం ఉన్నదా? ఉంటే అదేమిటి?


ఈ సంశయాలు తొలగించమని అడగడం తప్ప నాకు ఇంక ఏ కోరికా లేదు. నీ దయ వల్ల సకల శత్రువులనూ జయంచి సప్తద్వీపాలతో అలరారే వసుంధరను ఏకచ్చాత్రిధిపత్యంగా పరిపాలించాను. నీ కుపావలేశంతో యముణ్ని కూడా ఎదిరించగలను. సకల రాజభోగాలు తనివి తీరా అనుభవించాను. ఇక నాకు ఏమీ వద్దు. తురీయ పురుషార్ధాన్ని అందుకునే శక్తి ప్రసాదించు ముక్తిని అనుగ్రహించు. ఇలా కార్తవీర్యార్జునుడు వినయవిధేయులతో అర్ధించాడు అని చెప్పి వేదధర్ముడు ఒక్క నిముషం ఆగాడు.


No comments:

Post a Comment