Wednesday, 5 April 2023

శ్రీదత్త పురాణము (100)

 


అణిమ - అణువుకన్నా సూక్ష్మ స్థితిని పొందడాన్ని అణిమ అంటారు. 

మహిమ - సమస్త జగత్తుచేత పూజింపబడటం మహిమ

లఘిమ - తేలికగా అతి శీఘ్రంగా ప్రయాణించగలడం లఘిమ

ప్రాప్తి- తానింక పొందవలసింది ఏదీలేదు అన్నంతగా సమస్తాన్ని పొందడం ప్రాప్తి 

ప్రాకామ్యం- సనుస్త ప్రదేశాలకు తాను వ్యాపింపగలగడం- ప్రాకామ్యం 

ఈశిత్వం - తానే ఈశ్వరుడవ్వడం ఈశిత్వం 

వశిత్వం - తామ సమస్తాన్ని వశపరుచుకోగలగడం వశిత్వం

గరిమ - పరం - ఏదికోరుకోదగిన స్థానమో ఏది సమస్త ఐశ్వర్యములకు నిలయమో అదియే గరిమ - పరం 

వీటినే అష్ట సిద్ధులు అంటారు. వీటిని విడిచిపెట్టి ముందుకు సాగగలిగితేనే నిర్వాణం లభించేది. వీటిలో దేనికి లొంగిపోయినా పతనం తప్పదు.


యోగసాధనతో ముక్తి పొందడం అంటే - అపునర్భవ స్థితిని పొందడం. ఇది జనన మరణాలు లేని స్థితి. గర్భవాసం జననం వృద్ధి వార్ధక్యం కృశత్వం మృతి అనే ఆరు రకాల వికారాలు ముక్తుడికి వుండవు. పంచభూతాల సాంగత్యంతో భేదం క్లీశం దాహం ఇత్యాదులు ఇతడికి వుండవు. భోక్తకాడు, భోజ్యుడు కాడు, తనకు నిత్యసన్నిహితమైన యోగాగ్నితో సమస్త దోషాలను దగ్ధం చేసుకొని యోగి నిర్మలుడై బ్రహ్మపదార్థంలో శాశ్వతంగా కలిసిపోతాడు. వేరే ఆలోచనే వుండదు. నీరు నీటిలో కలిసినట్లు ఎన్నడూ, ఎవ్వరూ, ఎలాగూ వేరుచెయ్యడానికి వీలు లేనట్లుగా కలిసిపోతాడు. పరమాత్మతో ఆత్మ సామ్యాన్ని పొందుతాడు. దీన్నే బ్రహ్మైక్యం అంటారు. 


No comments:

Post a Comment