Monday 3 April 2023

శ్రీదత్త పురాణము (98)

 


ఈ విధి నిషేధాలు పాటింపకుండా ఎప్పుడుపడితే అప్పుడు ప్రాణాయామం చేస్తే బదిరత్వం, జడత్వం, ఆంధత్వము ఏర్పడే ప్రమాదం వుంది. ప్రమాదవశాత్తు ఇవి వస్తే యోగంతోనే చికిత్స చేసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే జావను గోరువెచ్చగా త్రాగి యోగానికి కూర్చోడం మంచిది. ఇలా కూర్చుని రోగశాంతికి మనస్సులో ప్రత్యేకధారణలు చెయ్యాలి. వేడి తగ్గాలంటే శీతాన్ని, శీతం తగ్గాలంటే వేడిని, కఫం తగ్గాలంటే మహాశైలాన్ని, అతిదాహం ఉపశమించాలంటే నాలుక మీద ఆమ్ర ఫలాన్ని, చెవుడు తగ్గాలంటే చెవుల్లో సుస్వర సూక్తులనూ ధారణ చెయ్యాలి. మతిమరుపు తగ్గాలంటే శిరస్సుపై చెయ్యవలసిన ప్రత్యేకధారణలు వున్నాయి. ఇవికాక ప్రకృతి శక్తుల వల్ల అనారోగ్యం కలిగితే వాటిని తగ్గించుకోడానికి యథావసరంగా పంచభూతాలను ధారణ చెయ్యాలి. ధర్మార్థ మోక్షాలకి శరీరమే ప్రధాన సాధనం కనుక యోగి తన శరీరాన్ని ధృఢంగా ఆరోగ్యంగా వుంచుకోవాలి. అభ్యాసం కొనసాగుతున్నప్పుడు కొన్ని చిత్రవిచిత్రమైన యోగసిద్ధులు కలుగుతాయి. వీటిని పరులకు చెప్పకూడదు. గర్వంగా ప్రదర్శించకూడదు. అలా చేస్తే ఆ సిద్ధులు అంతరించిపోతాయి. కాబట్టి రహస్యంగా వుంచుకోవాలి.


ఆరోగ్యం, మృదుస్వభావం, శరీరకాంతిసౌరభాలు, ప్రసన్నత, కంఠస్వర సౌమ్యత, మూత్రపురీషాల అల్పత్వం- ఇవీ యోగసిద్ధికి తొలిచిన్నెలు. ప్రజలకు తన యందు అనురాగం కలగడం, తన గుణగణాలను పరోక్షంగా కొనియాడటం, మిగతా ప్రాణికోటి తనను చూసి భయపడకపోవటం, అలాగే వాటిని చూసి తాను బెదరకపోవటం, అత్యుష్ట అతిశీతల బాధలు తనకు లేకపోవటం ఇత్యాదులు యోగసిద్ధికి లక్షణాలు.


యోగసిద్ధులు కలుగుతున్న వేళ యోగికి కామ్యకర్మల మీద మనస్సుపోతుంది. రసాయన- రసక్రియాదులపైకీ, దేవత్వ- అమరేశత్వ ప్రకటనల మీదికి, జల- అగ్ని ప్రవేశాల వైపుకీ చిత్తం పరుగులు తీస్తుంది. దీన్ని మాత్రం ప్రయత్నపూర్వకంగా నిలుపుదల చేసుకోవాలి. లేకపోతే యోగం చెడిపోతుంది.


మనస్సును బ్రహ్మ పదార్థంలో సంలగ్నం చెయ్యడం ద్వారా దాని చాంచల్యాలను అదుపు చేయవచ్చు. అలా వీటిని జయంచి యోగాభ్యాసం కొనసాగిస్తుంటే మరికొన్ని అవరోధాలు ఎదురవుతాయి. వీటినే ఉపసర్గలు అంటారు, యోగాభ్యాసానికి ఇవి కూడా అవరోధాలే. ఇవి అయిదు వున్నాయి. ప్రాతిభం - శ్రావణం - దైవం- భ్రమం - ఆవర్తం. ఈ పంచవిధోపసర్గలూ సత్వరజస్తమో గుణాల నుండి ఆవిర్భవించి యోగానికి విఘ్నం కలిగిస్తాయి.


No comments:

Post a Comment