నాయనా వర్ణాశ్రమధర్మాలు దేవతలకు వేరు - మనుష్యులకు వేరు - పక్షులకు వేరు - జంతువులకు వేరు - సదాచార పరాయణులైన మంచివారిలో కూడా వర్ణాశ్రమాచారాలు విధులు వేరు వేరుగా వుంటాయి. పరమార్ధనిష్టతో వివృత్తికాములైన ఈ శిష్టులు చిత్తశుద్ధి కొరకు అవసరమైన సత్కర్మలు చేస్తుంటారు. వీరిలో కొందరు యోగమార్గాన్ని ఆశ్రయిస్తే కొందరు తపస్సును, కొందరు దానధర్మాలను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు శత్రు వినాశనం- రాజ్య సుస్థిరత - స్వర్గం - యశస్సు - భార్యాపుత్రులు - ధనం - ఇంట్లాంటివి కావాలని కోరుతూ సకాములై వేదవాద విమోహితులై యజ్ఞయాగాదులు చేస్తున్నారు. ఇన్ని భేదాల్లో ఏవి నింద్యాలు ? ఏవి శిరోధార్యాలు ? ఎవరు పండితులు? ఎవరు కారు? అన్ని మార్గాలు వేదాలను అనుసరిస్తున్నవే. వేదసమ్మతాలే. అన్నీ ప్రశస్తాలే. ఈ వేదమే పరమేశ్వరుణ్ని శుద్ధజ్ఞాన స్వరూపమని చెప్పింది. ఇలాంటి నిర్లిప్తుడు సృష్టి మొదలు నుండి కాలానుగుణంగా నింద్యకర్మలూ, ఆనింద్య కర్మలూ చేస్తూనే వున్నాడు. లీలామానుషరూపాలు అనేకం ధరించి భూమిపై అవతరించీ, అవతరించకా - దుష్టశిక్షణ శిష్ట రక్షణ అనాదిగా చేస్తున్నాడు. వీటిలో ఏది దోషమంటావు? ఏది కాదంటావు? అన్ని ధర్మాలకు మూలమైన వేదమే ప్రవృత్తి- నివృత్తి మార్గాలను రెండింటినీ సమతుల్య ప్రధానంతో ప్రబోధిస్తోంది. పరస్పర విరుద్ధాలైన ఈ రెండింటిని ఒకే కర్త ఒకేసారి అవలంభించగలడా? అవలంభించలేడు. కనుక ఇవి వేరు వేరు వ్యక్తుల కోసం అని మనం గ్రహించాలి. అధికార భేదాన్ని బట్టి ఆచారభేదము, ధర్మభేదము, మార్గభేదము ఏర్పడతాయి. అందుచేత మనం అనుకునే సదాచార - దురాచాక భేదం పరమాత్మకు వర్తించదు. ఆ పరమేశ్వరుడి పాదపద్మపరాగాన్ని శిరసావహించి, యోగాభ్యాసంతో కర్మబంధాలన్నీ వదిలించుకున్న మునీశ్వరులే దేనికీ బద్ధులు కాకుండా అన్నింటికి అతీతులై స్వేచ్ఛగా, స్వేచ్ఛాదృతశరీరులై సంచరిస్తూ వుంటే ఇక పరమాత్మకా, ఈ బంధనాలు నియమనిష్టలూనూ? అతడికి సదాచారమేమిటి? దురాచారమేమిటి? కార్యమేమిటి? ఆకార్యమేమిటి? ఏదీ లేదు.
యోగీశ్వరుడైన శ్రీహరి సర్వజగత్తుకూ సాక్షాత్తూ ఆత్మ. సర్వభూతములందు వుండువాడు. లీలా విగ్రహధారి. ఈ విజ్ఞాననిధి భూతదయతో సజ్జనులకు అభయం ఇవ్వడం కోసము ఇలా అనసూయా అత్రి దంపతులకు ముని కుమారుడై అవతరించాడు. కనుక పరమాత్మ ధర్మాతిక్రమణం చేస్తున్నాడు అనడం సాహసం వంటిదే. సర్వభక్షకుడైన అగ్నికి ఏ దోషమూ అంటనట్లే పరమాత్మకూ అంటదు. మదవతీమదరతుడై కనిపించాడని మూర్ఖత్వంతో మనమూ ఆ పనులు చేస్తే ధర్మభ్రష్టులము అవుతాము నశిస్తాము. శివుడు విషం త్రాగాడు కదా అని మనమూ త్రాగుతామా? త్రాగి బ్రతుకుతామా? అందుచేత ఈశ్వర అవతారాలు చెప్పినట్లు మనం చెయ్యాలే తప్ప వారు చేసినట్టు మనం చేయకూడదు. అహంకార మమకారాలను పూర్తిగా త్యజించిన వారికి ఇక సదాచారము దురాచారము అంటూ వుండదు. దానివల లాభంగానీ దీని వల నష్టంగానీ వుండదు. అఖిలభూతాలకూ దేవ, మానవ, తిర్యగ్జాతులకూ అందరికి కుశలప్రదుడైన పరమాత్మకు ఆచార హాని ధర్మహాని వల్ల నష్టం ఏమీ వుండదు. అన్నింటికి అతీతులు అవతార పురుషులు అంటే. కనుక నాయనా దీపకా! ఇలాంటి సందేహాలు బుర్రలోకి రానివ్వకు. తగిన శిక్షణ లేని మూఢులు వేసే ఇలాంటి ప్రశ్నలు ఇంకెప్పుడూ వేయకు.
No comments:
Post a Comment