Tuesday, 18 April 2023

శ్రీదత్త పురాణము (112)

 


తృతీయ భాగం


దీపకుడు వేదధర్మునికి పాదాభివందనం చేసి ఇలా అడిగాడు. ఆధ్యాత్మిక జ్ఞానరాశి! గురుదేవా! నాదొక సందేహం. దేవాదిదేవుడూ జగద్విధాత అయిన పరమేశ్వరుడు అనసూయ అత్రిమహర్షులకు తనయుడుగా జన్మించి మునియై- విరాగియై అనాచారాన్ని ఎందుకు ఆశ్రయించాడు? పెద్దలు ఏది ఆచరిస్తే ఏది ఉపదేశిస్తే తక్కిన వారంతా అదే ఆచరణీయం కాబోలు అనుకుని అనుసరిస్తారు గదా!


దీపకుని సందేహ నివారణ


ఆనందకందమైన పరమాత్మ అసలు విప్రుడుగా ఎందుకు జన్మించాడు? లోకంలో బ్రాహ్మణుడు అంటే ధర్మప్రవర్తకుడూ మోక్ష మార్గోపదేశకుడు కదా! మరి బ్రాహ్మణుడుగా పుట్టి ఇలా విరుద్ధంగా ప్రవర్తించటం ఏమిటి? ఇది సత్సంప్రదాయమేనా? దయానిధీ విశ్వబంధూ ఇది నా సందేహం దయచేసి దీన్ని తొలగించు, ఆస్తకాముడూ, పరమానంద స్వరూపుడూ అయిన ఈశ్వరునికి ఏ దోషమూ అంటదన్నట్లయితే అసలు బ్రాహ్మణుడుగా పుట్టడం ఎందుకు? పుట్టినపుడు ఆ ఉపాధికి తగినట్లుగా ప్రవర్తింపక నిరంతరం స్త్రీ సంగమ సంయుక్తుడై, మద్యపానరతుడై, మదమూరి నేత్రుడై మట్టి కొట్టుకున్న దేహంతో ఆడ ఏనుగుకి లొంగిపోయిన మదమాతంగంలా ప్రవర్తించటం. అందరికీ దర్శనం అనుగ్రహించటం ఇది ఏమిటో నాకు తెలియడం లేదు. ఇది నా దృష్టికి సమంజసంగా తోచటం లేదు. ఇందులో ఏదో రహస్యం వుంటుంది. అది తెలియచేసి నా సందేహాన్ని తొలగించండి. అప్పటికిగానీ నా మనస్సు కుదుటబడదు అన్నాడు దీపకుడు.


నాయనా దీపకా నీకు కలిగిన సందేహమేనా ఇది? ఏమో ఎందుకు అడిగావో మనస్సులో పెట్టుకొని మల్లగుల్లాలు పడకుండా అడిగి మంచి పనిచేసావు. చెబుతాను విను. లోకంలో ఇలాంటి సందేహాలు లేవనెత్తేవాళ్ళు వుంటారు. అంటూ వేదధర్ముడు చిరునవ్వులు చిందిస్తూ ఇలా చెప్తున్నాడు.


No comments:

Post a Comment