Sunday 2 April 2023

శ్రీదత్త పురాణము (97)



ప్రాణాయామంలో పూరక, కుంభక, రేచకములని మూడు ఉపాంగాలు వున్నాయి. ఇలాంటి పన్నెండు ప్రాణాయామాలకి ఒక ధారణ అని పేరు. రెండు ధారణలు ఒక యోగం. ఈ యోగం వల్ల మానసిక కిల్బిషాలన్నీ నశిస్తాయి. స్థిరచిత్తం ఏర్పడుతుంది. ఆత్మదర్శనం అవుతుంది. ఈ అనుభవాన్ని రుచిచూసిన యోగి ప్రకృతినీ దానికన్నా వేరైన ఆత్మనూ తేలికగా గుర్తిస్తాడు. వీరు మితాహారులై నిరంతరాభ్యాసంతో క్రమక్రమంగా ఉన్నతోన్నత స్థితులను పొందగలుగుతాడు.


ప్రాణవాయువును నియమించటం ప్రాణాయామమైతే, ఇంద్రియాలు ఉపసంహరింపబడటం ప్రత్యాహారం అవుతుంది. మనస్సును నిశ్చలపరచటం "ధారణ" అంటారు. ఈ ధారణ సమయంలో మనస్సును నాభి – హృదయం - ఉరస్సు - కంఠం - ముఖం - నాశికాగ్రం- నేత్రాలు- భూ మధ్యభాగం మూర్ధం బ్రహ్మరంధ్రం ఈ భాగాలలో క్రమక్రమంగా నిలుపుకుంటూ వెళ్ళాలి. ఈ పదవస్థానంలో నిల్వడాన్నే ఆత్మైక్యం అంటారు..


ప్రాణవాయువును పూరకం చేసేటప్పుడు కొద్ది కొద్దిగా నెమ్మది నెమ్మదిగా పీల్చాలి. యంత్రనాళాల నుండి దాహార్తుడు నెమ్మదిగా జలాన్ని పీల్చినట్లు వాయువును పూరించాలి. అలాగే రేచకము కూడానూ. లేదంటే వ్యాధులు సోకే ప్రమాదముంది.


ఆకలి - అలసట - మనోవ్యాకులత - ఇవి ఉన్నప్పుడు ప్రాణాయామంగానీ యోగాభ్యాసం కాని చెయ్యరాదు. అలాగే అతివేడి వున్న సమయంలో, అతి చల్లగా వున్న సమయంలో, అతిగా వాయువు వీచే వేళ అభ్యసించరాదు. ధ్వని కాలుష్యం, చెమ్మనేల, భీకర ప్రదేశం, ఎండుటాకులు ఉన్న చోట్లా, రచ్చపట్టులు, నదీరూపాలు వున్న చోట్లా, నాలుగు కాళ్ళ క్రూరజంతువులు వుండే చోటా, పాములు మిగతా విషజీవులు సంచరించే ప్రాంతాలలో యోగానికి పనికిరాని ప్రదేశాలు. అన్నీ అనుకూలంగా చూసుకొని మనస్సులో సత్వగుణం ఉదయించినప్పుడు మాత్రమే యోగాభ్యాసం చెయ్యాలి. మలమూత్రాలు కానప్పుడు భుక్తాయాసంతో వున్నప్పుడు ఇది అస్సలు చెయ్యరాదు.


No comments:

Post a Comment