Wednesday 12 April 2023

శ్రీదత్త పురాణము (106)

 


యోగీశ్వరా ! ఇలా నీ సన్నిధికి నన్ను వచ్చేట్టు చేసిన సుబాహువూ కాశీనరేశ్వరుడూ నాకు నిజంగా మహోపకారులు. నీ అనుగ్రహాగ్ని జ్వాలలో నా అజ్ఞాన కిల్బిషాలన్నీ పూర్తిగా దగ్ధమైపోయాయి. ఏనాడూ ఇంక ఏ దుఃఖమూ నన్ను ఆవరించకుండా జాగ్రత్తపడతాను. జ్ఞానదాతవైన నువ్వు అనుమతిస్తే ఇప్పుడే ఇక్కడే, ఆర్తీ - దుఃఖమూ అనే వృక్షాలకు అడవీవంటిదైన గృహస్థాశ్రమాన్ని పరిత్యజిస్తాను అంటూ అలర్కుడు దత్తస్వామికి సాష్టాంగపడ్డాడు. -


స్వామి ప్రేమగా అలర్కుణ్ని లేవనెత్తి తలపై నిమిరి రాజేంద్రా ! నీకు శుభమగుగాక, ఇంక బయలుదేరు. నువ్వు అన్నట్టే చేయి. నా మాటలన్నీ గుర్తుంచుకో. నిర్మముడవూ, నిరహంకారుడవూ అయి ముక్తికోసం ప్రయత్నించు అన్నాడు. అలర్కుడి కన్నుల్లో భాష్పాంబు కణాలు పెల్లుబికాయి. ప్రేమ విహ్వలుడై దత్తదేవుణ్ని స్తుతించాడు.


అలర్కుడు చేసిన దత్త స్తుతి


దత్తదేవా యోగవిద్యను ప్రవర్తింపజేయడం కోసమే అవతారం ధరించినవాడవు నవ్వు. స్వరూప ఆవిర్భావంతో దేహాన్ని తుచ్ఛీకరించిన వాడవు. విజ్ఞానానికి నిలయం నీవు. అధిష్టాన దేవతవు నీవు. సుర సిద్ధసాధ్య కిన్నెర కింపురుషాదులు నీ పాద పద్మాలు సేవిస్తూ ఉంటారు.


ఓ మహానుభావా ! భక్తులను అనుగ్రహించు అనోరణీయుడవు, మహతో మహీయుడవు. బ్రహ్మాండమంత విశాల దేహము నీదే. సూక్ష్మ చిత్ శక్తి నీవే. దిగంబరుడవు నీవే. విచిత్ర దివ్యాంబర ధారివి నీవే. ఇదే నీకు నా నమోవాకం. యోగీశివంద్యుడవు, యోగవిఘ్ననాశకుడవు, మహానుభావుడవు, వృద్ధుడవు, బాలుడవు, సర్వమూ నువ్వే. కాంతతో సరసములాడుతూ సశరీరంతో నున్న నవ యవ్వన యువకుడవు నీవే. నిన్నర్ధం చేసుకోవడం చాలా కష్టం. నమోనమః నమోనమః. జనన మరణ పరంపరలకు భయపడి మునులు సమాధి నిష్టతో నిన్ను ధ్యానిస్తూంటారు. మన్మధున్ని జయించిన విరాగుల మనస్సులలో నిరంతరం మెదిలే పరతత్వానివి నీవు. పదసత్తులకు అతీతమైన పరం - ఆత్మదైవానివి, నీలో లీనమైన ఈ యోగులు, విరాగులు మరికదేనినీ ఎరుగరు. వారికి నువ్వు తప్ప మరొకటిలేదు. పరము, అవ్యయము, దివ్యము విజ్ఞాన చైతన్యము అయిన బ్రహ్మతత్వానివి నీవు. స్వతఃసిద్ధము, సనాతనము అయిన సాక్షాత్తు పరంజ్యోతిని నీవు. సర్వదేవతామయుడవు. పురుషోత్తముడవు, వాచాను గోచరుడవు, నిర్గుణ పరమాత్మవు. నీకిదే నా ప్రణతి. నారాయణా ! పద్మనాభా ! జగద్రూప ! జగత్కారణ ! వాక్యశక్తి ! వాచకశక్తి ! శరణాగత వత్సల! ప్రణతరక్షక! పూర్ణ ప్రబోధా ! యోగేశ్వరా నమస్తే నమస్తే విశ్వంభర ! గరుడ కేతన గోపాలక, అజ్ఞానమనే అజగరం మింగేస్తున్న ఈ విశ్వాన్ని ఉద్ధరించు. శ్రీపతి, భూపతి వేదశాస్త్రాలకు పురుడుపోసిన వాక్పతి ! వేదాంత వేద్యా ! సర్వ ప్రమాణ గోచరా ! నమోస్తుతే!


No comments:

Post a Comment