నిర్గుణ పరబ్రహ్మవైన నిన్ను చెప్పేటప్పుడు కన్నులుండవు అయినా చూస్తుంది. చెవులుండవు అయినా వింటుంది. అని వేదాంతులు చెప్తుంటారు. ఇప్పుడేమో లీలా స్వీకృత శరీరుడవై దత్తాత్రేయుడుగా మా ముందు నిలిచావు. చూసే కళ్ళూ, వినే చెవులూ మాట్లాడే నోరూ అన్నీ వున్నాయి. మరినన్ను కరుణించెను అంటే ఎలా? దత్తస్వామీ మీ పాద పద్మాలు వలచి వచ్చిన తుమ్మెదను నేను. వీటిని విడచి వెళ్ళను. వెళ్ళలేను. నీ కన్నులతో ఒక్కసారి చూసి నా హృదయానికి ఆనందాన్ని కలిగించు దయాంబురాశీ నీవే తప్ప వేరుదిక్కులేదు. అనన్య శరణుణ్ని. నీ పాదసేవ తప్ప నాకు వేరే విధీ, కర్తవ్యమూ లేదు. ఈ భవసాగరం నుండి కడతేర్చు. నామరూప రహితుడవైన నువ్వు అవతారాలు ధరించేది ఇందుకేనటగదా. నన్ను ఉద్ధరించు. పుండరీకాక్షా! నమస్తే! పురుషోత్తమా! నమస్తే! విశ్వవంద్య, పదాబ్జా నమస్తే! యోగివరా! వాసుదేవా! సూక్ష్మరూపా! సర్వాధ్యక్షా! నమస్తే నమస్తే నమస్తే! ఈ పాప సముద్రం నుండి కాపాడు. వాక్కులకే కాదు మనస్సుకు కూడా అందనివాడా! భక్త హృదయనివాసా! పంకజనాభా, పంకజ మాలికా ధారీ - పంకజనేత్రా - పంకజాంఘ్రీ నమస్తే! ఆనంద స్వరూపా కరుణించు. పరమేశ్వరా దయచూపించు. ఆది- వ్యాధులనే విషసర్పాలు నన్ను కాటువేసాయి ప్రభూ నన్ను ఉద్ధరించు.
సాయంకాలం అయ్యింది కార్తవీర్యార్జునుడు ఇలా ఎంత స్తుతించినా ఆడినా, పాడినా, దత్తస్వామి ధ్యాననిష్ట నుండి కన్నులు తెరచిచూడలేదు. ఖిన్నుడై అర్జునుడు అలాగే అలసి సొలసి నమస్కరించి నిలబడ్డాడు.
వేదధర్ముడు చెబుతూంటే శ్రద్ధగా వింటున్న దీపకుడికి సహజంగానే మరో సందేహం వచ్చింది. తనకిష్టుడైన కార్యవీర్యార్జునుడు అంతగా స్తుతిస్తే దత్తస్వామి ఎందుకు కన్నులు తెరువలేదు? అసలు తెరిచాడా లేదా? ఎప్పుడు తెరిచాడు? ఏమి అన్నాడు? ఇవన్నీ మనస్సులో కుతూహలం రేకెత్తించాయి. అనంతర కథను త్వరగా చెప్పమని అభ్యర్థించాడు వేదధర్ముడు ఇలా చెప్తున్నాడు. నాయనా దీపకా విను.
కార్తవీర్యార్జునుడు అలా స్తుతించి, స్తుతించి స్వామి ఎదుట తలవంచుకొని అంజలి ఘటించి నిలబడ్డాడు. రాత్రి గడుస్తోంది. మరొక జాములో తెల్లవారుతుంది అనగా దివ్య విమానముల నుండి సిద్ధపురుషులు అన్ని దిక్కుల నుండి అక్కడకు వచ్చి నేల మీద దిగి దత్తస్వామికి సాష్టాంగ నమస్కారములు ఆచరించి స్తోత్రాలు మౌనంగా జపించి దగ్గరలో మౌనంగా నిలబడి వున్న కార్తవీర్యార్జునుడ్ని ఓరకంట చూసి తిరిగి స్వామికి పదే పదే నమస్కరిస్తూ తమ తమ దివ్య విమానాలు ఎక్కి తేజస్సుతో దశదిశలా ప్రకాశింపజేస్తూ వెళ్ళిపోయారు. ఆ వెంటనే పది దిక్కుల నుండి యోగీశ్వరులు వచ్చారు. సహ్యాద్రి గుహల్లోనే ఉంటున్న కొందరు యోగులూ జత కలిసి అందరూ స్వామి పాదాలకు సాగిలపడ్డారు. చేతులు చాచి నమస్కరించారు.
No comments:
Post a Comment