మానవునికి మచ్చిక అయిన సింహశార్దూలాలు మానవుల్ని చంపటం మానేస్తాయి. అవును కదా అలాగే ఈ స్వాధీనం అయిన ప్రాణాయామం స్వదేహాన్ని హింసించదు. పోషిస్తుంది. కిల్బిషాలను మాత్రం శోషింపజేస్తుంది.
ప్రాణాయామానికి నాలుగు దశలు వున్నాయి. అవి ధ్వస్తి - ప్రాప్తి - సంవిత్తు - ప్రసాదం అని. మొదటి దశలో వున్న మనిషికి మనస్సు కషాయపక్వంగా ఉంటుంది. ఇష్టా ఇష్టాలు పాపపుణ్యాలు మనస్సు నుండి తొలగిపోతాయి. రెండవ దశలో (ప్రాప్తి) ఉన్న ప్రాణాయామ సాధకుడు, ఐహికాముష్మిక వాంఛలను అన్నింటినీ పొందుతాడు. మూడవ దశకు చేరుకున్న సాధకునికి దివ్యదృష్టి లభిస్తుంది. దూరంగా వున్న వాటిని, కంటికి కనిపించకుండా ఉన్న వాటిని భూత, భవిష్యత్తులనూ దర్శించగలుగుతాడు. సూర్యచంద్రాదులతో సమానమైన జ్ఞానప్రభావాన్ని పొందుతాడు. ఇక నాల్గవ దశకు చేరుకున్న ప్రాణాయాముసాధకుడి మనస్సు, పంచధాతువులు, పంచేద్రియాలు, ఇంద్రియార్థాలు, అన్నీ ఎంతో ప్రసన్నమవుతాయి. అపుడు అతడు బ్రహ్మనిష్టుడై బ్రహ్మానందాన్ని పొందుతాడు.
ప్రాణాయామాన్ని అభ్యసించి క్రమక్రమంగా నాల్గువ దశకు చేరుకోవటం యోగాభ్యాసంలో మొదటి మెట్టు మాత్రమే. ఆపైన చెయ్యవలసిన యోగాభ్యాసం గురించి చెబుతాను తెలుసుకో.
ఆసనం - పద్మాసనం, అర్ధపద్మాసనం, స్వస్తి కాసనం ఈ మూడూ యోగసాధనకు అనువైనవి. వీటిలో తనకిష్టమైన ఏదో ఒక ఆసనం వేసుకొని కూర్చోవాలి. వెన్నుపూసను నిటారుగా నిలబెట్టాలి. శిరస్సును సమస్థాయిలో వుంచాలి. నోరు తెరువకూడదు. దంతాలు పరస్పరం తాకకూడదు. చూపుల్ని నాసికాగ్రం మీద నిలపాలి. హృదయంలో ఓంకారాన్ని జపించాలి. తమోగుణాన్ని రజోగుణంతో, రజోగుణాన్ని సత్వగుణంతో, అణిచివెయ్యాలి. అందువల్ల నిర్మలాంతఃకరణం సిద్ధిస్తుంది. నాభి నుండి కంఠం వరకూ వాయువును పూరించాలి. మనఃప్రాణేంద్రియాలను ఆయా విషయాల నుండి లోపలికి ఉపసంహరించాలి. తాబేలు తనశిరః కర, చరణాలను దొప్పలోకి ముడుచుకున్నట్లు వీటిని ఉపసంహరించాలి. బాహ్యభ్యంతరాలను పూర్తిగా మరచిపోవాలి. దృష్టిని లోపలికి సారించాలి. తనలో తనను చూసుకోవాలి. కామాలను ప్రత్యాహరించటం కాబట్టి దీన్ని ప్రత్యాహారం అంటారు.
No comments:
Post a Comment