Saturday, 1 July 2023

శ్రీదత్త పురాణము (185)

 


వణి క్పుత్రకా ! యతి పాదోదకం పురాకృత పాప సంఘాలను పారద్రోలుతుంది. అది అక్షయోదకం. సప్తజన్మలనూ పాపరహితాలుగా ప్రక్షాళన చేస్తుంది. ఇక ఆ పరమ హంసలకు ఆతిథ్యమిచ్చిన పుణ్య ఫలం ఎంతటిదంటే - వెయ్యి సంవత్సరాలకైనా నేను వివరించలేను.


ఈ చరాచర జగత్తులో ప్రాణులు శ్రేష్టమైనవి. ఆ ప్రాణుల్లో మతి జీవులు శ్రేష్టమైనవి. మతి మంతులలో నరులు శ్రేష్టులు. వారిలో 'బ్రాహ్మణులూ వారిలో 'విద్వాంసులూ విద్వాంసుల్లో ధర్మనిర్ణయం చెయ్యగలిగిన కృత బుద్ధులూ వారిలో మళ్లీ స్వయంగా ధర్మాచరణచేసే కర్తలూ, ఆ కర్తల్లోనూ బ్రహ్మవేత్తలూ ఉత్తమోత్తమములు. బ్రహ్మ వేత్తల కన్నా ఉత్తములూ శ్రేష్టులూ భూతకాలంలో లేరు. భవిష్యత్తులో ఉండరు. అంచేతనే బ్రహ్మవేత్తలు జగత్రయ పూజ్యులు. వారి సాంగత్యం సర్వపాప వినాశకం. సకల పుణ్య ప్రదాయకం.


అటువంటి యతి పుంగవులు అంతటి బ్రహ్మనాదులు నీ యింట సత్కారాలు పొందారు. ఆతిథ్యం స్వీకరించారు.


విశ్రాంతి తీసుకున్నారు. వికుండలా! ఎనిమిదవ జన్మలో ఇలా నువ్వు ఆర్జించుకున్న పుణ్యం కొండంత ఉంది. అది నీ అగ్రజుడికి ధారపొయ్యి. నరకం నుండి విముక్తి పొందుతాడు.


వికుండలుడు సంబర పడుతూ యమదూతకు ధన్యవాదాలు పలికి సాష్టాంగ నమస్కారం చేసి తన పూర్వ పుణ్య ఫలాన్ని శ్రీ కుండలునికి ధారపోశాడు. వెంటనే శ్రీ కుండలుడు అసి పత్ర మహానరకం నుండి విముక్తుడయ్యాడు. యమదూత సత్కృతుడై వీడ్కోలు తీసుకున్నాడు. దేవతలు ఆ ఇద్దరు సోదరుల మీదా పారిజాత పుష్పవృష్టి కురిపించారు. దివ్య విమానంలో నాకలోకానికి తీసుకు వెళ్ళారు.


మాఘస్నాన మహిమను చెప్పడానికి దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి వినిపించి, ఈ కధను చదివిన వారు, విన్న వారు వెయ్యి గోవుల్ని సద్విప్రులకు దానం చేసిన ఫలం పొందుతారని ఫలశ్రుతి ప్రకటించాడు.


No comments:

Post a Comment