Monday 17 July 2023

శ్రీదత్త పురాణము (201)

 


శ్రీదత్త పురాణము


చతుర్ధ భాగము


సూతమహర్షీ ! జగదీశుడైన దత్తాత్రేయుడి చరితం వినిపించి మమ్మల్ని కృతార్ధుల్ని చేశావు. ఆ వేళ సాక్షాత్కరించిన స్వామి మాకు సమర్ధుడైన వక్తగా సర్వజ్ఞుడవైన నిన్ను అందించి ఎంతో మేలు చేసాడు. ఎంత విన్నా ఇంకా వినాలనిపించే తీరులో నువ్వు చెబుతూవుంటే మా మనస్సులు ఇక దేనిని స్మరించడంలేదు. ఎంత విన్నా తృప్తి తీరడం లేదు. ఆకొన్నవాడికి అన్నమూ దప్పిక గొన్నవాడికి పానీయమూ అందిస్తే అధిక ఫలదాయకమని పెద్దలమాట. అందుచేత హరి లీలామృతాన్ని మాకు ఇంకా పంచిపెట్టు. ఈ దాహం తీరేది కాదు. గురుశిష్యుల సంభాషణ ఏ తీరున సాగింది? దీపకుడు ఏమి అడిగాడు? వేదధర్ముడు ఏమి చెప్పాడు? సవిస్తరంగా తెలియజెప్పు.


శౌనకాదిమునుల అభ్యర్ధనను విన్న సూతుడు సంబరపడి అలాగే చెబుతాను ఆలకించండి. - అంటూ కొనసాగించాడు. దత్తాత్రేయులవారి వద్ద సెలవు తీసికొని మాహిష్మతీపురం చేరుకున్న కార్తవీర్యార్జునుడు మృషాకల్పితమని ఎరిగి రాజ్యాన్ని ఎంతకాలం పరిపాలించాడు? ఎలా పాలించాడు? యజ్ఞయాగాదులు చేశాడా? అసలు అతడి సామ్రాజ్య విస్తీర్ణం అప్పటి భూగోళంలో ఏపాటి? జైత్రయాత్రలు ఏమైనా చేశాడా? ఎవరెవరితో తలపడ్డాడు? ఎవరెవరిని జయించాడు? చివరకు అతడి కథ ఎలా ముగిసింది? ఇవన్నీ సందేహాలే గురుదేవా! తమరే తీర్చాలి అని దీపకుడు వేద ధర్ముణ్ని పాదాభివందనం చేసి మరీ అభ్యర్ధించాడు. దానికి ఆ మహర్షి సంతోషించి వెనకటికి మైత్రేయుడు ఇలాగే అడిగితే పరాశర మహర్షి ఆ కధ అంతా వివరించాడు. అదే యధాతధంగా నీకిప్పుడు చెబుతాను, ఆలకించు - అని వేదధర్ముడు అందుకున్నాడు.


కార్తవీర్య అవతార సమాప్తి


హైహయాన్వయుడైన కార్తవీర్యార్జునుడు సకల ద్వీపాలతోనూ కూడిన యావధ్భూగోళాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించాడు. అమోఘంగా పదివేల యజ్ఞాలు భూరిదక్షిణలతో చేసాడు. కార్తవీర్యుడుకి సాటి వచ్చే భూపతి భూతకాలంలో లేదు. భవిష్యత్కాలంలో ఉండదు- అని ఇప్పటికీ అతడిని భూగోళం అంతా కీర్తిస్తోంది. యజ్ఞాల్లోగానీ, దానాల్లో కానీ, తపస్సులో కానీ, వినయంలో కానీ, జ్ఞానంలో కానీ, అతడికి అతడే సాటి అని ప్రజలంతా కీర్తించారు. అలా ఎనభై అయిదువేల సంవత్సరాలు పాటు తిరుగులేని బలపరాక్రమాలతో మాహిష్మతి రాజధానిగా మొత్తం భూగోళాన్ని పరిపాలించాడు. ఒకనాడు ఆనందాతిశయంతో నర్మదా నదిలో జలక్రీడలు ఆడుతున్న వేళ ఈ హైహయుని చెంతకు దిగ్విజయకాంక్షతో దశకంఠుడు (రావణాసురుడు) వచ్చాడు. దేవ, దైత్య, గంధర్వులను గడగడలాడించిన ఆ రావణున్ని ఒక బలిపశువులా బంధించి కారాగారంలో పడేశాడు. ఇంతటి కార్తవీర్యార్జునుడూ ఎనభై అయిదు వేల సంత్సరముల తరువాత శ్రీమన్నారాయణాంశ సంభవుడైన పరశురాముని చేతిలో అవతార సమాప్తి పొందాడు. అదేమిటి గురూత్తమా! శ్రీమన్నారాయణుడు తన భక్తుల్ని తానే వధించుకున్నాడా? లీలావతారాలు చాలా ధరించాడు శ్రీహరి, కానీ ఏ అవతారంలోనూ భక్త ద్రోహం చెయ్యలేదే. సర్వజ్ఞుడూ సర్వసాక్షీ ఇలా ఎందుకు చేసాడు? తత్వజ్ఞాన సంపన్నుడైన కార్తవీర్యుడు అంతటి అపరాధం ఏమి చేశాడు? ఎలా చేశాడు? దత్త దేవుని అనుగ్రహానికి పాత్రుడైవుండీ స్వయంగా యోగి అయ్యిండీ దేవదేవణ్ని గుర్తించలేకపోయి అపరాధం చేశాడా? రాజమాత్రుడుగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ గుర్తించలేకపోయాడే అనుకుందాం. గుర్తించగలిగిన శ్రీమన్నారాయణుడు తనకు అత్యంత భక్తుడూ మహాయోగీశ్వరుడూ అయిన పార్ధివుణ్ని ఎలా సంహరించగలిగాడు? ఎందుకు సంహరించాడు? దయచేసి ఈ సంశయాలు నీవు దీర్చకపోతే నా మనస్సు కుదుటబడదు. గురుసత్తమా! అనుగ్రహించు.


No comments:

Post a Comment