నాయనా! దీపకా! కార్యవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు చెప్పిన ధర్మోపదేశాలూ యోగ సారమూ మాఘమహాత్మ్యమూ అన్నీ నీకూ తెలియపరిచాను. ఒకప్పుడు ఇదే మాఘమహిమను వశిష్ఠుడు తన శిష్యుడైన దిలీపుడికి చెప్పాడు. ఇంకా నువ్వు ఏమి వినాలనుకుంటున్నావో అడుగు చెబుతాను. నువ్వు నాకు సేవలు చేసి సంతృప్తి పరిచావు కనుక మహారోగ నివారణకు తోడ్పడ్డావు గనక ఆ ప్రేమను పురస్కరించుకుని మరొక రహస్యం నీకు చెబుతున్నాను విను. ఒకప్పుడు ఆ పార్వతీదేవికి ప్రేమగా శివుడు ఉపదేశించిన పద్నాలుగు దత్తనామాలు నీకు ఉపదేశిస్తాను. వీటిని జపిస్తే సహస్ర నామజప ఫలం దక్కుతుంది అని శివుడి ఆజ్ఞ. పార్వతి వీటిని జపించి అంతటి పుణ్యఫలం పొందింది.
వరదః కార్తవీర్యాదిరాజ రాజ్య ప్రదోఽ నఘః
విశ్వశ్లాఘ్యఽమితాచారో దత్తాత్రేయో మునీశ్వరః
పరాశక్తి పదాక్లిష్లో యోగానంద స్పదోన్మదః
సమస్త వైరి తేజోహృత్సరమామృత సాగరః ||
అనసూయాగర్భ రత్నం భోగమోక్షముఖ ప్రదః ।
నామాన్యేతాని దేవస్య చతుర్ధశ జగద్గురోః ॥
హరేన్దత్తాభిధానస్య జప్త వ్యాధి దినేదినే!
సహస్ర నామ జాప్యస్య యదిచ్ఛసి ఫలమ్ శుభమ్ ||
1. వరదుడు 2. కార్యవీర్యాది రాజులకు రాజ్య ప్రదుడు 3. అనఘుడు 4. విశ్వశ్లాఘ్యుడు 5. ఆమితాచారుడు 6. దత్తాత్రేయుడు 7. మునీశ్వరుడు 8. పరాశక్తి పదాశ్లిష్టుడు 9. యోగానందుడు 10. సదోన్మదుడు 11. సమస్త వైరితేజో హరుడు 12. పరమామృత సాగరుడు 13. అనసూయా గర్భరత్నం 14. భోగ మోక్ష సుఖప్రదుడు. జగద్గురువైన దత్తాత్రేయుడి పద్నాల్గు నామాలివి. సహస్రనామ జప ఫలం కావాలనుకుంటే వీటిని రోజూ జపించాలి. వత్సా! శుభ ప్రదాలైన ఈ చతుర్దశ నామాలను నువ్వు కూడా త్రిసంధ్యల్లోనూ జపించు. ఇంకేమి వినాలి అనుకుంటున్నావో సందేహించక అడుగు అని వేదధర్ముడు ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకున్నాడు. బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెప్పిన ఈ వృత్తాంతాన్ని నేను మీకు చెబుతున్నాను. శ్రద్ధగా వింటున్నారు గదా అని సూతుడు శౌనకాది మహర్షులను హెచ్చరించాడు.
No comments:
Post a Comment