మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినది మొదలు కొని ప్రతీ రోజూ స్నాన దానాది సత్కార్యాలకు యోగ్యమైనదే. అయితే మాఘ స్నానాలు పెరట్లో చేసే కంటే వెలుపలి నదీ ప్రవాహాలలోనో సరోవరాలలోనో చెయ్యడం శ్రేయస్కరం. మాఘ స్నానం ఒక వ్రతమన్నారు గదా! దాని నియమాలు తెలుసుకో. తెలుసుకొని పాటిస్తే అధిక పుణ్యఫలం దక్కుతుంది. నెల నాళ్ళూ నేల మీదనే పరుండాలి. స్థండిల శయనమే తప్ప హంస తూలికా తల్పాలు పనికి రావు.
తిలవి మిశ్రితమైన ఆజ్యంతో హోమాలు చేయాలి. సనాతనుడైన వాసుదేవుణ్ని ముప్పొద్దులా అర్చించాలి. మాధవార్పణంగా అఖండ దీపారాధన చెయ్యాలి. వ్రతం ముగిసేదాకా దీపం మలగరాదు. కంబళ్ళు - ధోవతులు - పాదరక్షలు - పసుపు కుంకుమలు - నెయ్యి - నూనె - కార్పసకౌశేయాలు (చొక్కా గుడ్డలు) - దూది - నూలు దుప్పట్లు ఇలాంటివే ఇంకా ఉపయోగపడే వస్తువుల్ని శక్తి సామర్థ్యాలు దాచుకోకుండా దానం చెయ్యాలి. గురివింద గింజంతయినా బంగారం బ్రాహ్మణుడికి దానం చెయ్యగల్గితే అది సముద్రంలాగా అక్షయమై ఎప్పుడూ తరంగితమవుతూ వుంటుంది. వ్రత స్వీకారం చేసిన విప్రుడు పరాగ్నిని సేవించకూడదు. దానాలు పట్టరాదు. శీతబాధా నివారకమైన ఇంధనాన్ని ఈ నెలలో దానం చేస్తే మరీ మంచిది.
మాఘ స్నానవ్రతం ముగిసిన వెంటనే ధన లోభం లేకుండా అన్న సంతర్పణ చెయ్యాలి. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. దక్షిణతాంబూలాలు అందించాలి. ఏకాదశినాడు మాఘోద్యాపనం అచ్యుతార్పణంగా శ్రద్దగా విధివిదానంగా చెయ్యాలి. బంగారం లేదా వెండి శ్రీ హరి ప్రతిమలను ద్విజోత్తములకు వినయ విధేయతలతో అర్చించి బహుకరించాలి. బ్రాహ్మణ దంపతులను లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావించి యధోచితంగా పూజించి భోజన సంతృప్తుల్ని గావించాలి.
మకరస్థే రవౌమాఘే గోవిందాచ్యుతమాధవ
స్నానేనానేన దేవేశ యధోక్త ఫలదోభవ ॥
ఈ శ్లోకాన్ని మనస్సులో జపిస్తూ మౌనంగా స్నానం చెయ్యాలి. సారాంశం ఏమంటే దిక్కులు చూస్తూ మనస్సు చెదరగొట్టుకోకుండా కేశవనామాలు జపిస్తూ స్నానం చెయ్యాలి. దేవేశా! ఈ స్నానంతో నాకు రావలసిన పుణ్యాన్ని దక్కించు - అని ప్రార్ధిస్తూ స్నానం చెయ్యాలి. చేశాక కూడ కేశవ నామాలే జపిస్తూ ఇంటికి చేరుకోవాలి. యదావిధిగా అర్చనలూ పూజలూ దానాలూ జపాలూ సాగించాలి.
No comments:
Post a Comment