Thursday 13 July 2023

శ్రీదత్త పురాణము (197)

 


వృద్ధరాక్షసుడి ఆవేదన కాంచన మాలినిని కరుణారసార్ధ్రను చేసింది. ఒకప్పటి తన ఆవేదన తన పశ్చాత్తాపం గుర్తుకు వచ్చాయి. పుణ్యదానం చెయ్యాలనిపించింది. రాక్షసోత్తమా! ఇప్పుడే నీకు నిష్కృతి కలిగిస్తాను. దుఃఖించకు. నీ ముక్తికి గట్టిగా ప్రయత్నం చేస్తాను. ఏటేటా మాఘస్నానాలు చేశాను. ఎన్నో ఏళ్ళ తరబడి చేస్తున్నాను. అదీ శ్రద్ధగా చేస్తున్నాను. త్రివేణీ సంగమంలో చేస్తున్నాను. కనుక ఎంతో కొంత పుణ్యం రాశిపడి ఉంటుంది సందేహం లేదు - అది నీకు కొంత ధారపోస్తాను. ఆర్తుడికి చేసిన దానమే దానమని వేదవిదులు ప్రశంసిస్తున్నారు. సముద్రంలో కురిసిన మేఘుడు ఏ ఫలం మూటగట్టుకుంటున్నట్టు?


మిత్రమా! త్రివేణీ సంగమంలో చేసిన ఒక మాఘ స్నాన వ్రత ఫలం నీకు సమర్పిస్తున్నాను. దీనితో నీకు దేవతాకారమూ స్వర్గతీ లభిస్తాయి. ఆ పుణ్యఫలం ఎంతటి మహిమాన్వితమో నేనింతకు ముందు అనుభవించాను కనక సద్య స్సర్వపాప వినాశకంగా అమరత్వ ప్రదాయకంగా దాన్ని నీకు దానం చేస్తున్నాను అని చెప్పి కాంచన మాలిని నీళ్ళోడుతున్న తన చీర చెంగును చేతిలోకి పిండుకుని ఆ వృద్ధరాక్షసుడి దోసిట్లోకి ఇదమేకం మాఘజం - పుణ్యం తుభ్యమహం సంప్రదదేనమమ - అని ధారపోసింది. ఆ ధార దోసిట్లో పడటమేమిటి రాక్షసుడు దేవతాకారం ధరించడమేమిటి ఒక్కసారిగా జరిగిపోయాయి. అతడి దివ్యతేజస్సు దశదిశలనూ దగద్ధగాయమానం చేస్తోంది. అంతలోకి దేవతా విమానం వచ్చి అతడి చెంత నిలిచింది. హర్షిత్ఫుల్లలోచనుడై అధిరోహించాడు.


కళ్యాణీ! నిష్కృతియే లేదనుకున్న నాకు ఇంతటి మహోపకారం చేశావు. సదసత్కర్మలకు అనువైన ఫలం అందించే దేవదేవుడు నీకు సమస్త సన్మంగళాలనూ ప్రసాదించుగాక! కారుణ్యమయీ! మరికాస్త అనుగ్రహించి నాకు సర్వనీతిమయమైన మార్గం ఉపదేశించు. నువ్వు నాకు గురుస్థానీయవు. నీ మాట నాకు శిరోధార్యం, జీవితంలో నేనింక ఏ పాపమూ చెయ్యకుండా తగిన ఉపదేశం ఇయ్యి. అది విన్నాక నిన్ను స్తుతించి ధన్యుణ్ని అవుతాను. అటుపైనీ సురలోకం చేరుకుంటాను. ఆకాశమార్గాన విమానంలో తన చెంత నిలబడి అభ్యర్ధించాడు ఆ నూతన త్రిదశుడు.


No comments:

Post a Comment