Wednesday 26 July 2023

శ్రీదత్త పురాణము (208)

 


"ఓయీ పరశురామా! దత్తాత్రేయునితో కలిసి మంత్ర పూర్వకంగా విధి విధానంగా మీ తండ్రికి అంతిమ సంస్కారాలు శ్రద్ధగా నిర్వహించు" ఇది వినడంతోనే పరశురాముడు నాలుగువైపులకూ తేరిపార చూశాడు. కందమూల ఫల సమృద్ధితో పచ్చగా ప్రశాంతంగా ఉన్న ఆశ్రమంలో తామున్నట్టు గుర్తించాడు. కావిడి దింపుకున్నాడు. దృష్టి ముందుకు సారించాడు. గుబురుగా ఉన్న చెట్ల మాటున ఎవరో ఉన్నట్టనిపించి అటు నాలుగు అడుగులు వేశాడు. ఒక దిగంబర మహర్షి పానపాత్రను చేతబట్టి కనిపించాడు. రాముడు సభక్తికంగా నమస్కరించాడు. కన్న తండ్రి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించమని ప్రార్ధించాడు. ఏమిటి? నేను జరిపించాలి? నాకు విధివిధానములు, ధర్మాధర్మములు తెలియవు. ఏదో నాకు తోచిన దారిలో నేను పోతున్నాను. నాలాగే నీకు తోచిన దారిలో నువ్వు వెళ్ళు అన్నాడు దత్తస్వామి.


స్వామిన్ ! నీకు ధర్మాధర్మాలు తెలియవంటే నేనెలా నమ్ముతాను. సకల దేవతలకూ సకల మునులకూ నువ్వు పరమ గురువువి. జగత్ప్రసిద్ధుడివి. యోగీశ్వరుడివి నువ్వే సంశయం లేదు.

జమదగ్ని పాదాలకు నమస్కరించి పరశురాముని వైపు చూశాడు. రామా! శుభప్రదాలైన సర్వతీర్ధ క్షేత్రాలలో స్నానం చేసిరా. నేను చెప్పినట్టు సంస్కారం చేద్దువు గాని - అని ఆజ్ఞాపించాడు. రాముడు వెంటనే ధనస్సు సంధించి దివ్యబాణం ఎక్కుపెట్టి సహ్యాద్రిని గురిచూసి వదిలాడు. ఆ బాణ రంధ్రం నుంచి భుక్తిముక్తి ప్రదాలైన సకల పుణ్య నదీ తీరాలూ క్రమంగా ఆవిర్భవించాయి.


ఇలా తన దివ్యబాణ శక్తితో రప్పించుకొన్న పవిత్రనదీ తీర్ధజలాలలో పరశురాముడు స్నానం చేసి తండ్రి కళేబరానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి అగ్నిని ఉజ్వలంగా ప్రజ్వలింపజేసి దహన సంస్కారం జరిపాడు - జగన్మాతయైన రేణుక సర్వాభరణ భూషితయై నిలిచి దత్తాత్రేయా! పతివెంట నేను కూడా స్వస్థానానికి వెడదామనుకుంటున్నాను అని చెప్పి, నాయనా, భార్గవరామా! గురుదేవ, ద్విజులను రక్షించు నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని ఆజ్ఞాపించి, ఆ జగదంబిక తన పతిదేవుడి చితిలో సాంజలి బంధంగా ప్రవేశించింది. మరుక్షణాన భార్యా భర్తలిద్దరూ దేదీప్యమాన దివ్యరూపులై ఆనందమూర్తులై విను వీధిలో నిలిచారు. దత్తాత్రేయ, పరుశురాములిద్దరూ ఆ దంపతుల్ని చూసి సంబరపడుతూ శిరసువంచి నమస్కరించారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేసి వీడ్కోలు పలికారు.


No comments:

Post a Comment