Friday 14 July 2023

శ్రీదత్త పురాణము (198)

 



కాంచన మాలికి పట్టరానంత ఆనందం కలిగింది. తన ఉపకారం వల్ల ఒక రాక్షసుడు దేవతగా మారడమే ఒక ఆనందమైతే, అలా మారినవాడూ విమానమెక్కి తుర్రుమనక తన ఉపదేశం అర్ధించడం ఇంకా ఆనందాన్ని కలిగించింది. ప్రేమగా ధర్మోపదేశం చేసింది.


మిత్రమా! ఏనాడూ ధర్మం తప్పకు. ప్రాణి హింసకు పాల్పడకు. సాధు పురుషులను సేవించు. కామక్రోధాధుల్ని పరిత్యజించు. ఇతరుల దోషాలనో, గుణాలనో కీర్తిస్తూ కాలయాపన చెయ్యక నిత్యమూ సదాశివుణ్ణి ధ్యానించు. అంతర్భహిరింద్రియాలన్నింటినీ (స్వర్ణభాన్ని) జయించు. అస్థిమాంస రుధిరాలతోనూ మలమూత్రాలతోనూ నిండిన ఈ శరీరం చివరికి క్రిమికీటకాలకు ఆహారమవుతుంది. పురుగులు పడుతుంది. దీని మీదా దీనితో ముడిపడిన భార్యాపుత్రుల మీదా మమకారం విడిచిపెట్టు. ఈ జగత్తు క్షణభంగురమని తెలుసుకో. ఒక వైరాగ్యభావం అలవరచుకో. యోగాభ్యాసం వైపు దృష్టి నిలుపు. నీ మీద ప్రేమతో నీ మాట కాదనలేక ఏదో నాకు తెలిసిన ధర్మోపదేశం చేశాను. మనస్సులో పెట్టుకో. ప్రధానంగా శీల సంపన్నుడనై మెలుగు. జ్యోతిర్మయదేవుడవై వెలుగు. ఇక బయలు దేరు. సుఖంగా నాకలోకం చేరుకో.


అమ్మా! కాంచనమాలిని! అద్భుతమైన ధర్మోపదేశం చేశావు. నాకే కాదు అన్ని లోకాల వారికీ ఆచరణీయమైన నీతి మార్గం ఉపదేశించావు. ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి, పావనీ! నవ్వు కూడా ఇలాగే ఎప్పుడూ సుఖసంతోషాలతో జీవించు. ఎప్పుడూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపు. సాధ్వీ! నీకు సర్వదా శుభమగుగాక! కైలాసంలో శివ సన్నిధిలో ఆచంద్రతారకంగా నివశించు. పార్వతీదేవికి నీ మీద ప్రేమ ఇలాగే అఖండితంగా వర్ధిల్లుగాక. తల్లీ! ధర్మనిష్టా తపోనిష్టలతో నీ జీవితం చరితార్థమగుగాక. శరీర వ్యామోహం మరింకెన్నడూ నీకు కలుగకుండు గాక, ఇలాగే ఎల్లవేళలా ఆ పన్నుల ఆర్తిని హరింతువుగాక - సెలవు తల్లీ ! సెలవు అంటూ శిరస్సున అంజలి ఘటించి విమానంతో సహా - ముమ్మారు ప్రదక్షిణం చేసి నాకలోకానికి దూసుకు వెళ్ళిపోయాడు.


No comments:

Post a Comment