Tuesday 18 July 2023

శ్రీదత్త పురాణము (202)

 


నాయనా! దీపకా! ఆందోళన చెందకు ఈ సృష్టిలో ప్రతి జీవికీ జీవితంలో తప్పనిసరిగా జరగాల్సినవి కొన్ని ఉంటాయి. అవి జరిగే తీరతాయి. వాటిని ఆపడం. వాటికి ప్రతీకారం చెయ్యడం ఎవరి తరమూకాదు. అదే సాధ్యమైతే నల-రామ-యుధిష్టిరులు అన్ని కష్టాలుపడే వారా? అంత దుఃఖం అనుభవించే వారా?


అంతే కాదు, పురాణాలలో ఋషులు ఏనాడో చెప్పారు - బ్రహ్మాదులు కూడా ఈ జరగవలసిన దానికి వశవర్తులే తప్ప, స్వతంత్రులు కారని దీనినే "విధి" అంటారు. అది అనుల్లంఘ్యం. వైకుంఠానికి ద్వారపాలకులై యుండీ జయవిజయులు సనక సనందనాదుల శాపాన్ని తప్పించుకోలేక పోయారు. తత్వజ్ఞులూ జ్ఞాననిధులూ - ఎవరైనా గానీ విధిని అతిక్రమించలేరు. ఇలా విధికి లోబడినంత మాత్రాన ఆయా మహానుభావుల తత్వవిజ్ఞానానికి వచ్చిన లోటు ఏమీ లేదు. దాని ఫలం అది ఇస్తుంది. కేవలం శరీరమే కర్మాచరణ చేసి కిల్బిషాలు పొందుతూ వుంటుంది. ఫలం అనుభవిస్తూ వుంటుంది.


మరొక విషయం గమనించు సకల సృష్టికీ జనార్ధనుడు కర్తా హర్తా కూడాను. అంచేత దేహాది ఉపాధులను ఉపసంహరించడం అతడి అవశ్య కర్తవ్యం. పైగా పుట్టినది ఏదైనా గిట్టక తప్పదు. శరీరం నశించినంత మాత్రాన ఆ లోపల ఉన్న ఆత్మకు జరిగే నష్టం ఏమీ లేదుగదా! ఆ చిదాత్మ శాశ్వతమే. తత్వజ్ఞులైన పెద్దలు స్వీయ ప్రయత్నంతో వినాశం కొని తెచ్చుకోరు. అటువంటి పనులు కావాలని చెయ్యరు. కర్మ ప్రేరితులై చేస్తుంటారు. ఇది చాలా బలీయమైనది. పరమేశ్వరుడు సైతం స్వభావతః ఇచ్చానుసారం ఏ పనీ చెయ్యడు. ఆయా జీవుల కర్మలను అనుసరించియే సృష్టి జరుపుతాడు. అంచేత విధి అనూ-కర్మ అనూ అది అనుల్లంఘ్యం. అవశ్యంభావి. దాన్ని తప్పించుకోవడం ఎవరి తరమూకాదు. దత్తభక్తుడూ తత్త్వజ్ఞుడు అయిన కార్తవీర్యార్జునుడి అవతారం ముగియడానికి శ్రీమన్నారాయణుడే ముగింపజెయ్యడానికి కారణ భూతమైన కర్మ ఏమిటో వివరించనా. విను.


No comments:

Post a Comment