Saturday, 29 July 2023

శ్రీదత్త పురాణము (211)

 


గురూత్తమా! కార్త వీర్యార్జుని అవతార సమాప్తితో పాటు పరశురాముని వృత్తాంతం కూడా నాకు తెలియజెప్పి ఎనలేని ఆనందం సమకూర్చారు. అయితే ఇక్కడ నాదొక సందేహం. ఈ రేణుకాదేవి ఎవరు? సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడైన దత్తాత్రేయుడే నమస్కరించి స్తుతించాడంటే ఆ తల్లి అవతారగాధ వినవలసిందే. అనుగ్రహించండి. రేణు అనే మహారాజు ఒకరు ఉండే వాడనీ, ఆయనగారి కూతురు రేణుక అనీ, నేనెప్పుడో ఎక్కడో విన్నాను. అటువంటి రేణుకను దేవదేవుడు నమస్కరించడమేమిటి చెప్మా? అని నా సందేహం. అలాగే కాన్యకుబ్జంలో ఉండే పరశురాముడికి సహ్యాద్రిలో అమలకీ గ్రామం ఎందుకు ఆశ్రమమయ్యింది? అవి ఇప్పటికి నా చిరు సందేహాలు. దయచేసి వీటిని తీర్చండి.


దీపకుడి అభ్యర్ధనతో వేద ధర్ముడు వీటికి సమాధానాలు వివరించాడు. నాయనా, దీపకా! ఇదే విషయాన్ని పూర్వకాలంలో శ్రీశైల శిఖరం మీద మహర్షులడిగితే కుమారస్వామి వారికి వివరించాడు. అదంతా నీకు చెబుతాను - అంటూ ప్రారంభించాడు.


రేణుకా వృత్తాంతం


కృతయుగారంభంలో సృష్టి కర్త అయిన పితామహుడు అనేకోపాయాలతో ఈ జగత్ సృష్టి చేసాడు. దేవ - దైత్య - మనుష్య - పశు - పక్షి వృక్షాది జాతుల్ని వర్ణాశ్రమ ధర్మాలను సమస్తమూ వేద నిర్దిష్టమైన మార్గంలో సృజించాడు. ముల్లోకాలు హాయిగా ఉన్నాయి. అందరూ జ్ఞాన విజ్ఞాన పారంగులై తపోనిష్టులై కామ క్రోధ రాగ ద్వేష రహితులై శాంతి సౌఖ్యాలతో ప్రసన్నంగా కాలం గడుపుతున్నారు. బ్రహ్మదేవుడు గమనించాడు. ఇలాగైతే ఇక సృష్టి వృద్ధి చెందినట్టే - అనుకున్నాడు. ఆలోచించాడు. తమోగుణం, మోహం, మహామోహం, తామిశ్రం, అంధతామిశ్రం - అనే పంచ పర్వాలతో అవిద్యను సృష్టించి ప్రాణికోటిని సమ్మోహపరచడానికి లోకం మీదికి వదిలిపెట్టాడు. అతడు సృష్టించిన అవిద్య ముందుగా అతడినే ఆవరించింది. దాని మహిమతో వేదాలు మరిచిపోయాడు. ఎంత గింజుకున్నా ఒక్క మంత్రమూ గుర్తురావడం లేదు. కళ నళపడ్డాడు. భయపడ్డాడు. వెంటనే బయలుదేరి హంసవాహనం అధిరోహించి సహ్యపర్వతం చేరుకున్నాడు. ఒక ప్రశాంత రమణీయ స్థలంలో అమలకీ వనంలో (ఉసిరిక) కూర్చుని నిష్టాగరిష్టుడై రేణుకామాతను ధ్యానించాడు. ఆ తల్లి కరుణామయి. క్షణకాలంలో దర్శనమనుగ్రహించింది. చతుర్ముఖుడు ప్రణమిల్లి నిలిచి బహువిధాల స్తుతించాడు. మెల్లగా తన అవస్థను విన్నవించాడు.


No comments:

Post a Comment