Saturday 15 July 2023

శ్రీదత్త పురాణము (199)

 


అటువైపే చూస్తూ నిలిచిన కాంచన మాలినిమీద హఠాత్తుగా పుష్పవృష్టి కురిసింది. కిలకిల రావాలతో దేవకన్యలు చుట్టుముట్టారు. ఒక్కొక్కరూ మృదువుగా కౌగలించుకున్నారు. నేస్తురాలా! చిత్రంగా ఈ రాక్షసుడికి ముక్తి ప్రసాదించావు. అతడికన్నా మేము సంతోషిస్తున్నాం. ఈ దుష్టుడికి భయపడి ఇన్నేళ్ళుగా మేమెవ్వరమూ ఈ గిరికానన కందరాలకు రావడం మానుకున్నాం. నీ పుణ్యమా అని ఈ రోజునుంచీ హాయిగా విహరిస్తాం. అంటూ బుగ్గమీద చిటికెలు వేసి తూనిగల్లా తుర్రుమన్నారు. కాంచన మాలిని తనలో తాను హాయిగా నవ్వుకుంది. దివ్యవిమానం దూసుకు పోవడం నుంచి పూర్తిగా తేరుకుంది. సొంతపుణ్యం నుంచి కొంతదానం చేసి ఒకడికి సద్గతి కల్పించి మహోపకారం చేశాననే సంతృప్తితో గొప్ప ధర్మకార్యం చేసి కృత కృత్యురాలనయ్యాననే ధన్యతా భావనతో ముఖం వికసించగా ఆనంద భాష్పాలు కన్నుల్లో కమ్ముకోగా ఒక్క నిమిషం మురిసిపోయి కైలాసం వైపు తన ప్రయాణం సాగించింది.


కార్తవీర్యార్జునా! ఈ కాంచన మాలినీ వృత్తాంతం చదివినవారూ విన్నవారూ సాంసారిక సకలబంధ నివృత్తి పొందుతారు. ధర్మ పరాయణులవుతారు. శ్రద్ధగా విన్నావుగదా, మాఘస్నాన మహాత్యం ఎంతటిదో, క్లేశ నివారణ జరగాలన్నా స్వర్గం లభించాలన్నా మోక్షమే కావాలన్నా పకాములకూ నిష్కాములకూ సర్వశ్రేయస్కరం మాఘస్నాన మహావ్రతం, అర్జునా! నువ్వు నా మిత్రుడివి. స్నేహితుడివి. భృత్యుడివి. భక్తుడివి. నువ్వంటే నాకెంతో ఇష్టం. అంచేత నువ్వు ఏది అడిగినా కాదనను. అడుగు. ఇంకా ఏది వినాలని అనుకుంటున్నావో ఏమి తెలుసుకోవాలి అనుకుంటున్నావో, అడుగు చెబుతాను అని దత్తదేవుడు ఒక్క నిమిషం విరమించాడు.


గురుదేవా! సాక్షాత్తు శ్రీ వికేతనుడవైన నవ్వు ప్రసన్నుడవై యుండగా నాకింక అలభ్యమేముంటుంది? ఈ లోకంలో అత్యంత శ్రేయస్కరమైనవన్నీ నాకు దయతో ప్రసాదించావు. దృశ్యమానమైన ఈ మిధ్యా ప్రపంచంలో వస్తురూపంగా నీ నుంచి నేను అభ్యర్ధించవలసింది ఏదీ లేదు. భవభాగ్యనిధివి, భగవంతుడవు నువ్వు ఇలా ఎప్పుడూ. నా పట్ల ప్రసన్నుడుగా ఉంటే చాలు. నాకు ఇంకేమి అవసరము లేదు. నీ అనుగ్రహం కన్నా నేను కోరవలసింది ఏదీ లేదు. నీ ఉపదేశాలతో నన్ను కృతార్ధుణ్ని చేశావు. నన్నిప్పుడు ఏమి చెయ్యమంటావు? నీ పాదసేవ చేస్తూ ఇక్కడనే ఇలా


ఉండిపోనా? లేక ఇంటికి పోనా ? ఏమి ఆజ్ఞ ? కార్తవీర్యార్జునుడి ఆర్ద్ర వాక్కుల్లోని హృదయాన్ని అందుకున్నాడు దత్తస్వామి. అర్జునా ! నువ్వు రాజువి. రాజ్యపాలన చెయ్యడం నీ కర్తవ్యం. కనక వెంటనే బయలుదేరు. మహిష్మతీపురం చేరుకో. పరిపాలన సాగించు. అని అనుమతించాడు. కార్తవీర్యుడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ముని మండలికి అంజలి ఘటించి ఆశీస్సులందుకుని బయలుదేరాడు. దత్తనామస్మరణ చేస్తూ మహిష్మతీపురం చేరుకున్నాడు.


No comments:

Post a Comment