Friday 7 July 2023

శ్రీదత్త పురాణము (191)

 


వృద్ధ రాక్షసుడు గౌరవభావంతో కళ్ళప్పగించి చూస్తూ మౌనంగా తల ఊపాడు. కాంచన మాలిని ఆకాశం నుండి దిగి వచ్చింది. ఇద్దరూ ఒక చెట్టు నీడన చెరొక రాతి బండల మీద కూర్చున్నారు. కధనం ఇలా కొనసాగింది.


మా తండ్రి పేరు సుమేధుడు. గంధర్వనాయకుడు. నేను వారి పుత్రికను, కన్యకను. ఇంత తేజస్వంతమైన దివ్య రూపంతో ఎలా జన్మించానో అదీ చెబుతాను ఆలకించు. పూర్వ జన్మలో నేనొక వేశ్యను. కళింగ రాజు చేరికలో ఉండే దాన్ని. నా రూపం లావణ్యం కళింగ రాజధానిలో ఒక విధంగా మగ వారికీ మరొక విధంగా ఇల్లాండ్రకూ నిద్ర లేకుండా చేసింది. సర్వ యువతీ శిరోమణిగా సౌందర్య మదగర్వంతో విర్రవీగుతూ సకల రాజ భోగాలూ అనుభవించాను. రాజధాని మాత్రమే కాదు మొత్తం కళింగ సామ్రాజ్యమంతా నా యౌవన రూప సంపదకు సమ్మోహితమయ్యింది అంటే అతిశయోక్తి కాదు. కాంచన రత్నా భరణాలో, మనోహర వస్త్రాలో, అనూహ్య పరిమళ ద్రవ్యాలో, ఏవో ఒకటి కళింగాధిపతి రోజూ నాకు కానుకలుగా పెట్టేవాడు. ఇవే ఏమిటి, అతడి అధికారం అతడి కోశాగారం అన్నీ నా అధీనంలో ఉండేవి.


వింటున్నావు గదా! రాజు గారి కన్ను కప్పి నా నివాసమందిరంలో కొందరు యువకులు ఎప్పుడూ ఉండేవారు. కామ మోహితులై నాకు సేవలు చేసేవారు. కాళ్ళు పట్టేవారు. నేను అందరినీ వంచించాను. మాయచేసి అందరి ధనమూ లాగేశాను. వాళ్ళళ్ళో కొందరు పరస్పరం అసూయలతో హత్యలు చేసుకున్నారు. నిర్దనులై కొందరు ఆత్మ హత్యలు చేసుకున్నారు. కళింగ నగరంలో నా జీవితం ఇలా సాగింది ఆడింది ఆటగా పాడింది పాటగా.


శ్రోతా! ఎందుకో గానీ యౌవనం ఎప్పుడూ వేగంగా పయనిస్తుంది. వార్ధక్యలక్షణాలు నన్ను దురాక్రమణ చేసాయి. నా హృదయం భరింపరాని దుఃఖంతో మూలిగింది ఏమి లాభం? కాలానికి కళ్ళెం వెయ్యగలనా? పోయిన వయస్సును తీసుకురాగలనా? ఎంత సంపద ఉండి ఏమి ప్రయోజనం. ఎంత ప్రభావం ఉండి ఏమి ఫలం? నాలో ఒక ఆవేదన బయలు దేరింది. ఎండమావుల వెంట పరుగులు తీసాను. అదే ఎరుకగలిగింది. శాశ్వతానందం కోసం ఇకనైనా ప్రయత్నించాలనే సంకల్పం దృఢంగా ఏర్పడింది. ఒక దానమా? ఒక ధర్మమా? జపమా, తపమా? ఏమి చేసానింత కాలమూ? గుడికి పోలేదు. గోపురానికి పోలేదు. పుణ్య దినం లేదు. పర్వదినం లేదు. అంతా నాటకం. ధనార్జన, ధనార్జన శివుడినెత్తిన ఒక్క చెంబెడు నీరు కుమ్మరించిన పాపాన పోలేదు. శ్రీరంగేశుడి ముంగిట ముగ్గు కర్ర తీర్చిన పాపాన పోలేదు. దేవీనవరాత్రులలో రోజుకొక అలంకారంతో కనువిందు చేస్తుంది అమ్మ. చెలి కత్తెలు చెబుతూ వున్నా వినిపించుకోలేదు. వీళ్ళ పిచ్చిగానీ నన్ను మించిన సౌందర్యమా అని భీష్మించాను. ఎంత పిచ్చి దానిని, ఎంత దురహంకారిణిని. ఏనాడూ విప్రులకు విద్వాంసులకూ చెయ్యి విదిలించింది లేదు.


No comments:

Post a Comment