Sunday 23 July 2023

శ్రీదత్త పురాణము (205)

 


విక్రమిస్తున్న అర్జునునితో మృదువుగా ప్రారంభించి అతడి పరాక్రమాన్ని చూసి సంబరపడుతూ క్రమక్రమంగా విజృంభించాడు సాక్షాత్ శ్రీ మన్నారాయణుడైన పరశురాముడు. మహా వాయువు ఆకాశంలో మేఘ శకలాలను చెల్లా చెదురు చేసినట్లు అర్జునుడి బాణాలన్నింటినీ తన బాణాలతో మార్గ మధ్యంలోనే ఎగర గొట్టాడు. కార్తవీర్యుని ధనుస్సును కూడా విరుగ గొట్టాడు. కార్తవీర్యుడు కొత్త ధనుస్సును తీసికొన్నప్పుడల్లా ఇలాగే విరగ్గొట్టాడు. మొత్తం వంద ధనస్సులు అయ్యాయి. శర పంజరంలో బద్ధుడై సింహంలాగా గర్జించాడు కార్తవీర్యార్జునుడు. అయిదు వందల ధనుస్సుల్ని ఒకేసారి ధరించి ఆ సహస్ర బాహువు అయిదువందల బాణాలనూ ఎక్కుపెట్టి ఒక్కసారిగా రాముని మీదకు వేగంగా విడిచిపెట్టాడు. ప్రళయ కాల మేఘాలు తమ ఘోరవృష్టితో కాలాగ్నిని చల్లార్చినట్లు రాముడు ఆ బాణాలన్నింటినీ క్షణంలో వృధా చేసాడు.


కార్చిచ్చుల్లా ప్రజ్వరిల్లి మెరుపు వేగంతో శరవర్షం కురిపించి అర్జునుడి రధాన్ని తుత్తునియలు చేసాడు. నిరధుడై సహస్ర బాహువులతో రెక్కల పర్వతంలా నిలబడ్డ అతడి మీదకు లంఘించి గండ్ర గొడ్డలితో చెక్కేసాడు. మహా వృక్షం కొమ్మల్ని చెరిగినట్లు రెక్కలను నరికేశాడు. ఖండన వేగానికి అవి ఆకాశంలో ఎగిరి గిరికీలు కొడుతూ కల్ప వృక్షశాఖల్లా వచ్చి నేల మీదపడ్డాయి. దత్తాత్రేయుడి అనుగ్రహం వల్లా, మహాశివుడి దయవల్లా, అతడికి వెయ్యి రెక్కలూ మళ్ళీ వెంటనే మొలుచుకువచ్చాయి. కొత్త చేతులతో శక్తి ఆయుధం ధరించి పరశురాముడి ధనుర్భాణాలనూ గండ్రగొడ్డలనీ ఎగరగొట్టాడు. ఇలా ఒక వంద ధనస్సులూ ఒక వంద పరశువులూ అయ్యాయి. రామునిలో రోషం భగ్గుమంది. ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఒక్కసారిగా వెయ్యి చేతులూ మొదలంటా మార్చేసి మరింక మొలవకుండా చేసాడు. రెక్కలు తెగిన పక్షిలా నిరాయుధుడై నిలబడ్డాడు అర్జునుడు. ఆ నిమిషంలో అంతరాత్మ మేల్కొంది. యోగాభ్యాస దక్షుడు, కనుక వెంటనే ధ్యాన సమాధిలోకి ప్రవేశించి పరతత్వాన్ని స్మరించాడు. బాహ్య స్మృతిని కోల్పోయి స్థాణువులా నిలబడ్డ కార్తవీర్యార్జునుడి శిరస్సును ఒకే ఒక్క గొడ్డలి వేటు నేలకు రాల్చింది. పండిన తాటి పండు తనంత తాను నేలకు రాలినట్లు అది అల్లంత దూరాన దభీమని పడింది.


ఆ వెంటనే మొదలు నరికిన చెట్టులా కార్తవీర్యార్జునుడి కళేబరమూ నేలకు ఒరిగి పోయింది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. యోగ విద్యాపారంగతుడు కనుక అతడు ఇది వరకే జీవన్ముక్తుడు. ఇప్పుడు శరీరం రాలి పడిపోవడంతో విదేహముక్తుడయ్యాడు. కైవల్యం పొందాడు. శరీరంలోని పంచ భూతాలూ ప్రకృతిలోని పంచభూతాలలో కలిసిపోయాయి. పరశురాముని కోపం శాంతించింది. సంతోషంగా హోమధేనువుని తోలుకొని ఆశ్రమానికి చేరుకున్నాడు. జరిగినదంతా తండ్రికి నివేదించి తపస్సుకి వెళ్ళిపోయాడు.


No comments:

Post a Comment