స్వామిన్! దత్తదేవా! అరిందమా! నేను విష్ణువును కాను, మహాశూరుణ్ని కాను. ఇది నిజం. గురుదేవ-ద్విజులకు నేను శిష్యుణ్ని, వటువుని, సందేహం ఏమీ లేదు. దేవ ఋషి- పితృ తృప్తి కోసం ఏదో చెయ్యాలను కుంటున్నాను. దానికి నీ సహాయం కోరుతున్నాను. దయచేసి గురుస్థానం అంగీకరించు అంటూ ఒదిగి పరశురాముడు దత్తాత్రేయుడికి నమస్కరిస్తూ ప్రదక్షిణం చేశాడు. దత్తదేవుడు చిరునవ్వుతో అంగీకరించాడు.
ఆ రమ్యమైన సహ్యాచలమే యాగ భూమి అయ్యింది. ఋషులంతా ఆహుతులై విచ్చేశారు. ద్వారతోరణ పతాకాలంకారాలతో యాగ మంటపం సిద్ధమయ్యింది. వేదికలూ యజ్ఞ కుండాలూ శాస్త్రీయంగా రూపొందాయి. బ్రహ్మవేత్తలైన ఋత్విక్కులు. ఋజుభక్తి తాత్పర్యాలతో సమర్చితులై యజ్ఞాంగాలను అన్నింటినీ నిర్దుష్టంగా సంపూర్ణంగా నిర్వహించారు. దివ్యాభరణ వస్త్రాదులను బహుమతులుగా పొందారు. యజ్ఞశాలకు వచ్చిన ప్రతి విప్రుడికీ సువర్ణోపస్కురాలు దక్షిణలుగా అందాయి. అన్నపానాలు సమృద్ది చెప్పనవసరమే లేదు. అన్ని జాతుల వారికీ కావాలన్నదల్లా పుష్కలంగా అందింది. ఇలా రామయజ్ఞం సుసంపన్నం, సుసంపూర్ణం అయ్యింది. దేవ మానవ యక్ష కిన్నెర నాగరాక్షస చారణ సిద్ధ సాధక జాతులవారందరూ పితృదేవతలూ ధన - ఘన సన్మానాలతో సంతృప్తులయ్యారు. సోమంతో ఇంద్రుడూ, భూరి దక్షిణలతో భూసురులూ, అన్న పాన వస్త్రాదులతో దీనులూ పరితుష్టి చెందారు. ప్రధాన ఋత్విక్కుగా అన్నీ నడిపించిన కాశ్యపుడికి చాతర్ హోత్ర విధానంగా సంపూర్ణ క్షితి మండలాన్నే దక్షిణగా సమర్పించాడు భార్గవరాముడు. ఇరవై యొక్క మార్లు క్షత్రియ సంహారం చేసి భుజబలంతో తాను గెలుచుక్ను భూగోళమిది. కశ్యపుడికి దక్షిణ అయ్యింది.
ఆచార్యకత్వం నెరపిన దత్తస్వామిని రత్నాభరణాలతో దివ్య వస్త్రాలతో సత్కరించి ఆర్చించాడు. రాముడిచ్చిన వాటిని అన్నింటినీ దత్తదేవుడు అక్కడున్న మునులకూ, బ్రాహ్మణులకూ నమస్కరించి మరీ సమర్పించాడు. కాశ్యపుడు భార్గవరాముని అనుమతి తీసుకొని తన క్షితి మండలాన్ని విప్రులందరికీ పంచిపెట్టాడు. దీనికి పరశురాముడు చాలా సంబరపడ్డాడు. కాశ్యపా! నీ వంటి జ్ఞానులు చెయ్యవలసిన పనిని చేశావు. ముండిత శిరస్కుడై, దిగంబరుడై మన మధ్య నడయాడుత్ను ఈ యోగివర్యుడు దత్తాత్రేయుడు స్వయంగా సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు. సందేహం లేదు. ఇంత సుదుష్కరమైన ఈ మహాయజ్ఞం ఇంత తేలికగా ఒక లీలగా పరిసమాప్తమయ్యింది అంటే కేవలం ఇది వీరి అనుగ్రహమే, శ్రీ దేవీ కరుణా కటాక్షమే - అని తన భక్తి భావాన్ని ప్రకటించి కాశ్యపునికి దత్త దేవునికీ మరొకసారి నమస్కరించి రేణుకామాతను మనస్సులోనే ధ్యానించి సురసిద్ద మునీంద్ర దేవ బ్రాహ్మణులందరికీ ఇంకొక పర్యాయం కృతజ్ఞతగా శిరసువంచి అభివాదం చేస్తూ అందరి దగ్గరా సెలవు తీసుకొని భార్గవరాముడు మహేంద్ర పర్వత శిఖరాగ్రాన తపస్సుకి వెళ్ళిపోయాడు.
No comments:
Post a Comment