Thursday 27 July 2023

శ్రీదత్త పురాణము (209)

 


అటు పైని బ్రాహ్మణులను అర్చించి మహదాశీర్వచనం తీసుకున్నాక పరశురాముడు స్వయంగా దత్తాత్రేయుణ్ని పాదాభివందన పురస్సరంగా పూజించాడు. దత్తదేవుడి అనుమతి పొంది అమలకీ వనం నుంచి బయలుదేరాడు. తన ప్రతిజ్ఞను తీర్చుకోడానికి భూమండలం మీద విరుచుకుపడ్డాడు. పొడి తప్పిన క్షత్రియులందర్నీ ముయ్యేడు మార్లు గాలించి రాసాడి రాపాడి ప్రతిన నెరవేర్చుకున్నాడు. భూమిని క్షత్రియరహితం చేసేశాడు. గతమత్సరుడై అదే జలం తీసుకొని దత్తాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ తన ఆయుధాలను ప్రక్షాళించి ఆయుధాధి దేవతలను అర్చించాడు. దత్తాత్రేయుడికి నమస్కరించాడు. అంతలో తల్లితండ్రులు దివ్యదర్శనం అనుగ్రహించారు. సకల క్షత్రియాంతకా! నీ సాహసానికీ శౌర్య పరాక్రమాలకూ సంతృప్తి చెందాను. ఇక ప్రతీకారాగ్నిని శాంతింపజేసుకో. హింసా ప్రవృత్తివల్ల మూటగట్టుకున్న మహాపాపం తొలగించుకోవడంకోసం మహాయజ్ఞాలు చెయ్యి వాటితో శుద్ధి పొందుతావు- అని తండ్రి జమదగ్ని ఆజ్ఞాపించాడు. నాయనా! బ్రహ్మచారిని గదా ధర్మపత్ని తోడు లేకుండా యజ్ఞాలు ఎలా చేస్తానని సంశయించకు. దత్తాత్రేయుణ్ని గురువుగా అభ్యర్ధించు. కాశ్యపుణ్ని ప్రధాన ఋత్విక్కుగా వరించు. బంగారపు ప్రతిమను భార్యగా చెంత ఉంచుకో. యజ్ఞాలు చెయ్యి - అని తల్లి రేణుక ఉపాయం చెప్పింది.


ఇలా ఆజ్ఞాపించిన తల్లిదండ్రులిద్దరికీ సభక్తికంగా నమస్కరించి వీడ్కోలు పలికాడు. సహ్యాద్రి ఆమలకవనంలోని ఏక వీరాశ్రమ పదంలో ఇది జరిగింది. ఫలపుష్పభరితాలైన తరులతా గుల్మాలతో పక్షుల కిలకిల రావాలతో నానామృగ గణాకీర్ణమై దివ్యనదీ పరీవాహక ప్రాంతమై అన్నిటికీ మించి దత్తాత్రేయ సంరక్షితమైన ఆ ప్రదేశం తపస్సులకే కాదు యజ్ఞయాగాదులకూ అనువైన స్థలం. ఆ ఆశ్రమంలో ఒక రమ్యమైన పర్ణశాల ఉంది. పరశురాముడు అందులోకి ప్రవేశించాడు. అది దత్తాత్రేయుడి పర్ణశాల. సురసిద్ధ సాధ్య మునీశ్వర సేవితుడై దత్తదేవుడు కొలువుతీరి ఉన్నాడు. పరశురాముడు వినయవిధేయతలతో సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తితో మౌనంగా స్తుతించాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఆనందతుందిలుడై పరశురాముణ్ని ఆప్యాయంగా దగ్గరకు పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. మృదువుగా సంభాషించాడు.


నాయనా, భార్గవరామా! నువ్వు చాలా కష్టసాధ్యమైన ఘనకార్యాలు చేశావు. కార్తవీర్యార్జునుడంతటి వాణ్ని అనాయాసంగా బాహు పరాక్రమంతో మట్టుబెట్టావు. దైత్య రాక్షస వీరులెందర్నో సంహరించావు. క్రూర కర్ములూ అధార్మికులూ అయిన దుర్జయ క్షత్రియ మహావీరులందరినీ ముయ్యేడు మార్లు ఏరి ఏరి మట్టి కరిపించావు. ఇంతలేసి ఘనకార్యాలు సాధించావంటే శిశూ! నువ్వు సాధారణ శూరుడవో బ్రాహ్మణుడవో కావని నా అభిప్రాయం. ఈ లోకంలో ఈ రూపంలో సంచరిస్తున్న స్వయం శ్రీమహావిష్ణుడవని నా నమ్మకం.


No comments:

Post a Comment