Sunday 2 July 2023

శ్రీదత్త పురాణము (186)

 


శ్రీ దత్తగురుత్తమా! మాఘ స్నానానికి ఇంతటి అద్భుత శక్తి ఎలా వచ్చింది? ఒక్కసారి స్నానం చేస్తే గత జన్మల పాపాలు తొలగిపోవడం మరోసారి స్నానం చేస్తే స్వర్గలోకం స్వాధీనమవ్వడం ఆశ్చర్యకరంగా వుంది. వణిక్కుమారుడు ఘోరపాపాలు చేసినా మాఘస్నానంతో విముక్తుడై స్వర్గానికి చేరుకోవడం మరీ వింతగా వుంది. దీని రహస్యం ఏమిటో బోధించమని తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను. స్వామి! దయచేసి అనుగ్రహించు.


మాఘ స్నాన విధి


కార్తవీర్యార్జునా! సలిలానికి సహజంగానే మలపంకిలాలను ప్రక్షాళన చేసే శక్తి వుంది. అది స్వయంగా నిర్మలం. స్నానం చేస్తుంటే ప్రాణానికి హాయిగా వుంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే నీరనేది ద్రావకం - దాహకం ధారకం పోషకం. తనలో మునిగిన వస్తువుల్ని క్రమక్రమంగా కిలుము వదిలిస్తుంది. పొరలు పొరలుగా తనలో కలుపుకుంటుంది. కనుక ద్రావకం - పాపాలను దహిస్తుంది కనుక దాహకం. జీవకోటికి ప్రాణాలు నిలుపుతుంది కనుక ధారకం - పోషిస్తుంది కనుక పోషకం వేదాలు సైతం యోపామాయతనం వేద - మొదలైన మంత్రాలతో నీటిని నారాయణ రూపంగా కొనియాడుతున్నాయి. అంతే కాదు గ్రహాలలో సూర్యగ్రహం నక్షత్రాలలో చంద్ర బింబం మాసాలలో మాఘమాసం - ఉత్తమోత్తమాలు. ఈ మాఘ మాసాన నిర్మల ప్రాతఃవేళ సూర్యుడు మకరంలో వున్న శుభ గడియల్లో గోష్పాదమంతటి (ఆవు డెక్క) నీటి ఘడియలో స్నానం చేసినా చాలు ఎంతటి పాపిష్టినైనా అది స్వర్గానికి చేరుస్తుంది.


మాఘ మాసం నెలవాళ్ళు తెల్లవారుజామున నదీ స్నానం చెయ్యడం అనేది ఒక వ్రతం. ఒక యోగం. దీనికి అశక్తులైన వారు కనీసం మూడు నాళ్ళయినా మాఘ స్నానాలు చెయ్యాలి. యధాశక్తిగా ఏదో ఒక వస్తువు దానం చెయ్యాలి. అలా చేసిన వ్యక్తి మరింక ఏ జన్మలోనూ దారిద్ర్యం అనుభవింపడు. పైగా ధనవంతుడుగా దీర్ఘాయుష్కుడుగా ఇహపరసుఖాలు పొందుతాడు. అయిదు రోజులు గానీ ఏడు రోజులుకానీ చేస్తే అతడి పుణ్య ఫలం చంద్ర కళల్లాగా వృద్ధి చెందుతుంది.


No comments:

Post a Comment