Saturday 8 July 2023

శ్రీదత్త పురాణము (192)


 

ఏ ప్రాణికి నేను చేసిన ఉపకారం అంటూ లేదు. ఎందుకొచ్చిన బ్రతుకు ఇది? నా కన్నా చెట్టూ పుట్టానయం. నోరు లేని జీవాలు నయం. పొరపాటుననైనా పిసరంత పుణ్యకార్యం చేసి ఎరుగను. మహాపాపాలు మాత్రం ఎరిగి ఎరిగి చాలా చేసాను. ఈ బాధతో ఈ ఆవేదనతో నా మనస్సు నన్ను దహించి వేస్తోంది. ఎన్నో రోజులు పగలూ రేయీ ఏకాంతంగా విలపించాను. నిద్రాహారాలకు దూరమై చిక్కి శల్యమయ్యాను. ఈ దశలో ఒక రోజున ఓపిక కూడ దీసుకొని రాజపురోహితుడి ఇంటికి వెళ్ళాను. కాళ్ళ మీద బడి వలవలా విలపించాను. శీల సంపన్నుడైన ఆ వేద విద్వాంసుడు ఎంతగానో నన్ను ఊరడించాడు. చాలా సేపటికి తేరుకున్నాను.


బ్రహ్మన్! నా పాపాలకు నిష్కృతి లేదు. చెప్పండి నేను సద్గతులు పొందే మార్గం ఉపదేశించండి. స్వయం కృతాపరాధాలతో నేను దహించుకు పోతున్నాను. ఏకాకినై విలపిస్తున్నాను. పాప పంకిలంలో మెడలోతు దిగబడిన నన్ను దయచేసి జుట్టు పట్టుకొని పైకిలాగండి. కారుణ్యవర్షం కురిపించండి. పాపపంకిలం వదిలించండి. అయిన వారికి అందరూ ఉపకారాలు చేస్తారు. నా బోటి విపన్నులకు సహాయం చేసిన వారే నిజమైన సాధు సజ్జనులు. క్షీర సముద్రం హంసలకేనా? కొంగలకు ఉపకరించదా? ఇదేమి అన్యాయం? స్వామి దారి చూపండి.


కాంచన మాలినీ! నీ జీవితం అంతా నేనెరుగుదును. నీ నిషిద్ధాచరణలు నేనెరుగుదును. ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగింది. సంతోషం. నువ్వు వెంటనే బయలు దేరు. ప్రజాపతిక్షేత్రం అయిన ప్రయాగ చేరుకో. అక్కడ త్రివేణీ సంగమంలో స్నానం చెయ్యి. అది ఒక్కటే సమస్త పాపాలనూ ప్రక్షాళన చెయ్యగలిగిన తీర్థం. ఇంతకన్నా మరొక దారి కన్పించడం లేదు. సకల పాపాలకు తీర్ధ స్నానమే ప్రాయశ్చిత్తంగా మునులు చెప్పారు. కానీ ఆ తీర్ధంలో ఉండి అమంగళాలను అశుభవాంఛలనూ మనస్సులోకి ఏ మాత్రం రానివ్వకూడదు. ఇది గుర్తుంచుకో. వెళ్ళిరా. ప్రయాగస్నానంతో పాపశుద్ధి పొంది నువ్వు స్వర్గానికి వెడతావని నాకు అనిపిస్తుంది. దాని శక్తి అటువంటిది. ఆ తీర్ధంలో తప్ప ఇతర ప్రాంతాలలో చేసిన ఎంతటి మహాపాతకమైనా మునిగిన తక్షణమే వదిలిపోతుంది.


పురాణ కాలంలో దేవేంద్రుడు ఒక తప్పిదం చేసి ఈ త్రివేణీ సంగమంలోనే మునిగి కిల్బిష విముక్తి పొందాడు. మనస్సు కుదుటపడుతుంది. నీకు ఆ కధ చెబుతాను శ్రద్ధగా విను.


No comments:

Post a Comment