అర్జునా! అసలే నేను శిష్య పరాధీనుణ్ని నువ్వానన్ను గెలుచుకున్న వాడివి. నువ్వు అడగడమూ నేను కాదనడమూనా, తప్పకుండా చెబుతాను. ఇదీ పుణ్య ప్రదమైన కథ. అత్యంత పురాతనమైన ఇతిహాసం. దీన్ని చెప్పడమో వినడమో కాదు. తలుచుకుంటే చాలు అశ్వమేధ ఫలం లభిస్తుంది. శ్రద్ధగా విను.
కాంచన మాలినీ వృత్తాంతం
అనగా అనగా ఒక అప్సరస. అత్యద్భుత రూప సంపన్న పేరు కాంచన మాలిని. ప్రయాగలో మాఘ స్నానం చేసి కైలాసానికి వెళుతోంది. ఆకాశ మార్గాన వెడుతున్న కాంచన మాలిని ఒక పర్వత నికుంజం నుంచి ఒకానొక వృద్ధ రాక్షసుడు చూసాడు. అపూర్వ తేజస్సుతో ధగ ధగ లాడుతోంది. పేరుకు తగ్గట్లే మేలిమి బంగారు కాంతులు నిరజిమ్ముతోంది. సుదీర్ఘలోచన. చంద్రావన. సుకేశి. పీనోవ్నతపయోధర. తను మధ్య వతానాభి. సుశ్రేణి. అందాల రాశిని చూసి ఆశ్చర్యచకితుడై ఆ రాక్షసుడు ఆరాధనా భావంతో మృదువుగా పలకరించాడు.
ఎవ్వతినే నీవు? భీతి హరిణేక్షణా! ఎక్కడి నుండి నీ రాక? తడిసిన నీ చీర, నీళ్ళోడుతున్న జుట్టుతో ఎక్కడ నుండి వస్తున్నావు? ఎక్కడకు వెడుతున్నావు? కమలాక్షీ ! నీకు ఈ ఆకాశ గమనం ఎలా వచ్చింది ? నీ దేహం నీ రూపం అపూర్వమైన తేజస్సుతో సౌందర్యంతో ధగ ధగ లాడుతున్నాయి. మనోహరంగా వున్నాయి. ఏం పుణ్యం చేసుకున్నావ్? నీకొస కొంగు నుండి జారిపడిన నీటిబొట్టు ఒకటి నా శిరస్సును అలంకరించింది. ఆ క్షణం నుండీ నా క్రూర మనస్సు ఏదో తెలియని శాంతిని అనుభవిస్తోంది? విశాలాక్షీ! ఇది నీ చీర మహిమా? లేదా నీరమహిమా? దయజేసి వివరించు? ఇంతటి సౌందర్యం ఉన్నదంటే సౌశీల్యమూ ఉండే వుంటుంది.
ఓయీ రాక్షసా! నేనొక అప్సరసను. కామ రూపిణిని. నన్ను కాంచన మాలిని అంటారు. ప్రయాగ నుండి వస్తున్నాను. అందుకే నాదుస్తులు నీళ్ళోడుతున్నాయి. సీతాసితజల సంగమంలో స్నానం చేసాను. ఎక్కడికి వెడుతున్నానో చెప్పలేదు కదూ! కైలాస పర్వత శిఖరానికి వెడుతున్నాను. అక్కడ దేవదానవ పూజితుడైన గౌరీ పతి కొలువుతీరి వుంటాడు గదా. పార్వతీ దేవిని సేవించుకోడానికి అక్కడికి వెడుతున్నాను. నీ క్రూర మనస్సు ఏదో తెలియని శాంతిని అనుభవిస్తోంది అన్నావు కదా అది నా చీర మహిమ కాదు ముమ్మాటికీ నీరమహిమే. త్రివేణీ సంగమంలోని నీటి బిందువు అది. దానికి అటువంటి మహిమ ఉంటుంది సహజం. నాకధ అంతా వింటే నీకే అవగతమవుతుంది. ఎవ్వతివే నీవు అన్నావు కనుక ఈ తేజస్సు ఏమిటి అన్నావు కనుక అంతా చెప్పాలి. వింటావా మరి?
No comments:
Post a Comment