Monday 24 July 2023

శ్రీదత్త పురాణము (206)

 


దీపకా! అటుపైన కార్తవీర్యుడి పుత్ర సంతానం మరొక స్వయం కృతాపరాధం కారణంగా పరశురాముని చేతిలోనే హతులయ్యారు. హతాశేషులు అతడి అనుగ్రహంతో రాజ్య పాలన చేసారు. పరశురాముడు ఈ భూగోళాన్ని క్షత్రియ శూన్యం చేస్తానని ప్రతిజ్ఞచేసి అలా నెరవేర్చుకున్నాడు.


గురూత్తమా! కార్తవీర్యుని అవతార సమాప్తిని కళ్ళకు కట్టినట్లుగా వర్ణించి చెప్పారు. అతడి సంతానం కూడా పరశురాముని చేతిలో హతులయ్యారంటే మరి వాళ్లు ఏ తప్పు చెయ్యడంవల్ల అలా జరిగింది? క్షత్రియ సంహారానికి రాముడు ఎందుకు ప్రతిజ్ఞ చేసాడు? ఇది తెలుసుకోవాలని ఉంది. దయచేసి అనుగ్రహించండి అని దీపకుడు అడగడమేమిటి వేదధర్ముడు కధా కధనం ఇలా ఆరంభించాడు.


పరశురామ ప్రతిజ్ఞ


కృతవీర్యుడి కుమారుడు కదా ఈ కార్తవీర్యుడు. ఇతడు లొట్ట చేతులతో పుట్టి తల్లితండ్రులకి తీవ్రమనస్తాపం కలిగించాడు. ఆ పైన దత్తస్వామిని అర్చించి ఆరాధించి సంప్రీతుణ్ని చేసి వెయ్యి బాహువులతో పాటు అనేక అమోఘ నరాలు పొందాడు. తనకు సమానుడో తన కన్నా అధికుడో అయిన ద్విజుడి చేతిలో మరణం ఆ వరాలలో ఒకటి. అందుకని పరశురాముని చేతిలో అలా నిహతుడయ్యాడు. దానికి హోమ ధేను హరణమనే మిష ఒకటి స్వయం కృతాపరాధమై సహకరించింది. విధి బలీయమనీ, ఏ అవతారమైనా ఉపసంహరింపబడవలసిందేననీ చెప్పుకున్నాం. కదా!


అయితే కార్తవీర్యార్జునుని కుమారులు పరశురాముని మీద కక్షగట్టి అనువైన సమయం కోసం ఎదురుచూస్తూ వేచి ఉన్నారు. ఎదిరించే ధైర్యంలేక, శక్తి లేక దొంగచాటుగా ప్రతీకారం తీర్చుకోడానికి, పొంచి ఉన్నారు. తమ తండ్రిని సంహరించాడు కనుక అతడి తండ్రిని చంపాలని వారికసి. కొంత కాలానికి అనువైన సమయం దొరికింది. పరశురాముడు అడవికి వెళ్ళాడు. అతడి సోదరులు ఆట పాటల్లో తేలుతూ అల్లంత దూరాన ఎక్కడో ఉన్నారు. జమదగ్ని పర్ణశాలలో తపస్సు చేసుకుంటున్నాడు. ఋషి పత్ని రేణుకా మాత ఇంటి పనుల్లో మునిగివుంది. ఇంత కన్నా మంచి సమయం దొరకదని రాకుమారులు సాయుధులై జమదగ్ని పర్ణశాలలో ప్రవేశించారు. జమదగ్ని శిరస్సు ఖండించారు. వద్దు వద్దంటూ రేణుకాదేవి అడ్డుపడినా విలపించినా, ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు. రాక్షసంగా శిరస్సు ఖండించి మెరుపువేగంతో వెళ్ళిపోయారు.


No comments:

Post a Comment