Tuesday, 11 July 2023

శ్రీదత్త పురాణము (195)

 


అంతటి మహిమ కలది ప్రయాగ సంగమం. కనుక ఓ కాంచన మాలినీ ! నువ్వు వెంటనే బయలు దేరి వెళ్ళు. త్రివేణీ సంగమంలో స్నానం చెయ్యి. పాప విముక్తి పొందుతావు. సద్గతులు కల్గుతాయి అని రాజపురోహితుడు ఉపదేశించాడు. వెంటనే వారి పాదాలకు నమస్కరించాను. ఇంటినీ బంధువర్గాన్నీ దాసదాసీ జనాన్ని ఆస్తిపాస్తుల్నీ తృణప్రాయంగా పరిత్యజించాను. విషయ వాంఛలను విషగ్రాసంలాగా వదిలేశాను. నశ్వరమైన ఈ శరీరం కోసమా ఇంత కాలమూ ఇన్ని పాపాలు చేశాను! ఈ దుస్సాంగత్యాలవల్ల దక్కే ఫలితమేమిటి? దారుణ నరక నివాసం - ఇలా ఉడికిపోతున్న హృదయంతో త్వరత్వరగా ప్రయాగ చేరుకున్నాను. నా అదృష్టం బాగుండి అది మాఘ మాసారంభం. పాడ్యమినాడు త్రివేణీ సంగమంలో సీతాసిత జలంలో స్నానం చేశాను. కాలపవ్యాఘ్రా! (రాక్షపోత్తమా) ఆ స్నానమహిమ ఏమని చెప్పను. మూడు రోజుల స్నానాలతో నా పాపాలన్నీ తొలగిపోయాయి. తక్కిన ఇరవై ఏడు రోజుల స్నానాలతో లభించిన పుణ్య విశేషంవల్ల నాకు ఈ దేవత్వం దక్కింది. కైలాసంలో పార్వతీదేవికి ఇష్ట సఖినై పరిచర్యలు చేస్తూ ఆనందిస్తున్నాను. అప్పటి నుంచీ ప్రతి మాఘమాసంలోమా నిత్యమూ లేదా కనీసం మూడు పర్యాయాలైన వచ్చి త్రివేణిలో స్నానంచేసి వెడుతుంటాను. ఆశ్చర్యచకితుడవై అడిగిన ప్రశ్నలకు అన్నింటికీ సవివరంగా సమాధానం చెప్పాను. నీ ముఖ కవళికలు చూస్తుంటే సంప్రీతి చెందావని తెలుస్తోంది. మరి నీ కథ చెప్పి నాకు కూడా ఇలాంటి సంప్రీతి కలిగించవచ్చుగా, నీ కసలు ఈ భయంకర రాక్షసరూపం ఎలా వచ్చింది? నీ దుష్కర్మకు ఫలమిది? ఈ మీసాలూ దీర్ఘదంష్ట్రులూ మాంస భోజనం గిరిగస్వార నివాసం ఏమిటిదంతా?


కళ్యాణీ, కాంచన మాలినీ! సజ్జనులకు కొన్ని లక్షణాలున్నాయి. ఇతరులకు ఇష్టమైనదాన్ని ఇస్తారు. తమకు ఇష్టమైన దాన్ని అడిగి తీసుకుంటారు. ఎంతటి రహస్యాలనైనా ప్రీతితో చెబుతారు. అలాగే అడిగి తెలుసుకుంటారు. ఈ లక్షణాలు నీలో ఉన్నాయి. కనుక నువ్వు సజ్జన శ్రేణికి చెందుతావు. కనుక ఇంతకాలానికి, నన్ను గౌరవించే ఒక ప్రాణివి దొరికావు. నేను అడిగానని నీ కథ అంతా చెప్పావు. నన్ను పట్టించుకుని నా దుర్గతికి కారణం అడిగావు. చెబుతాను. ఈ క్రూరజన్మకు కారణమైన నా దుష్కృత్యాలూ, స్వయంకృతాలూ అన్నీ చెబుతాను. దాపరికం లేకుండా చెబుతాను. నీలాంటి సజ్జనులకి వినిపిస్తే దుఃఖభారం తగ్గుతుంది. కాసింత హాయి దక్కింది. అదృష్టం బాగుంటే నిష్కృతి లభించవచ్చు. చెబుతున్నాను విను.


No comments:

Post a Comment