Sunday 9 July 2023

శ్రీదత్త పురాణము (193)

 


ఇంద్రుడికి శాప విమోచనం


గౌతమ మహర్షి ఇల్లాలు అహల్య. అపూర్వ సౌందర్య రాసి. దేవేంద్రుడు చూసి కామ మోహితుడయ్యాడు. మహర్షి ఆశ్రమంలో లేని వేళ తాను గౌతమ రూపంలో వచ్చి కోరిక తీర్చమని అభ్యర్ధించాడు దేవరాజు. అహల్య కుతూహలంతో అంగీకరించింది. అప్పుడే ఆశ్రమానికి చేరుకున్న గౌతమ మహర్షికి ఇద్దరూ దొరికి పోయారు. కామంతో కళ్ళు మూసుకుపోయి ధర్మ హాని చేసినందుకు మహర్షి కోపోద్రిక్తుడై ఇంద్రుడ్ని శపించాడు. దానితో ఇంద్రుడు కురూపి అయ్యాడు. సహస్ర భగచిహ్నితుడయ్యాడు. తలదించుకొని దేవరాజు విష్క్రమించాడు. అతిలజ్జాకరమైన ఆ కురూపం భరించలేక ఎవరి కంట బడటమూ ఇష్టంలేక తనను తాను నిందించుకుంటూ అసహ్యించుకుంటూ మేరు పర్వతం చేరుకున్నాడు. ఇంద్రలోకాన్ని ఇంద్ర పదవినీ విడిచి పెట్టేశాడు. ఆ పర్వత శిఖరం మీద ఒక విశాల సరోవరం. ఆ సరస్సులో ఒక పద్మం, ఆ పద్మ గర్భంలో దాక్కుని బలవంతంగా రోజులు నెట్టుతున్నాడు. చేసిన పాపానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఈ కామం ఎంత నింద్యమైనది. వెంటనే నరకంలోకి తోసేస్తుంది. ఆయుష్షు కీర్తి యశస్సు ధర్మం ధైర్యం - అన్నింటినీ ధ్వంసం చేస్తుంది. దురాచారుడైన మన్మధుణ్ని ఏమి చేసినా పాపం లేదు. సకల సంపదలకు అతడే మూలం. మానవులకు అత్యంత బలీయుడైన అంతశ్శత్రువు, అణచడానికి వీలు లేకుండా శరీరంలోనే తిష్ట వేసుకొని కూర్చున్న గూఢ దుర్మదుడు. నిత్యమూ అసంతుష్టుడు. నిత్యమూ అరుంతుదుడు. (మర్మ భేదకుడు. ఆయువులను పట్టి పీడించేవాడు)


పద్మ గర్భంలో దాక్కుని ఇలా ఇంద్రుడు కుమిలిపోతూంటే అక్కడ దేవలోకం పాలకుడు లేక బెగ్గడిల్లింది. దేవతలందరూ శచీదేవిని ముందు నిలుపుకొని దేవ గురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. సాష్టాంగ పడ్డారు. గురూత్తమా! దేవపతి జాడ తెలియరాలేదు. ఎక్కడికి వెళ్ళాడో? ఎక్కడ ఉన్నాడో? ఎక్కడని వెదకాలి? ఏమీ తోచక సలహాకోసం మీ సన్నిధికి వచ్చాం. ఇంద్రుడు లేని నాకలోకం కొడుకులేని వంశంలా క్షీణోమ్మఖం అవుతోంది. దీన్ని అరికట్టాలి. ఆలస్యం చెయ్యకండి. వెంటనే ఆలోచించి ఉపాయం చెప్పండి కర్తవ్యం ఉపదేశించండి అని ముక్త కంఠంతో దేవతలంతా ప్రార్ధించారు. శచీదేవి బిక్కమొగం వేసుకొని దీనంగా చూస్తూ నిలబడింది. 


దేవతలారా! శిష్యులారా! కంగారు పడకండి. ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. స్వయం కృతాపరాధానికి రజోగుణ ప్రేరితమైన ఒక పాప కృత్యానికి ఫలం అనుభవిస్తున్నాడు. నీతిమాలిన పనులు చేస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి. రాజ్యమదోన్మత్తుడై కార్యాకార్య వివేకం కోల్పోయాడు. ఇహపరాలను నాశనం చేసే నింద్యము గర్హితమూ కుత్సితమూ ఆవాచ్యమూ అయిన అకృత్యం చేశాడు. దైవోపహత చేతస్కులై బాలిశులు ఇలా ఆపరాదాలుచేస్తారు. ఇహపరాలలో జన్మను నిప్పులం చేసుకుంటారు. చాలామంది ఇంతే. నడవండి ఇంద్రుడి దగ్గరకు వెడదాం.


No comments:

Post a Comment