Wednesday, 12 July 2023

శ్రీదత్త పురాణము (196)

 


వృద్ధ రాక్షసుడి పూర్వజన్మ


పూర్వ జన్మలో నేను కాశీ నివాసిని. ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. ఋగ్వేదపారం ముట్టాను. కానీ రేవులో కాకినై నానాదానాలు పట్టాను. రాజుల నుంచి పుల్కసులదాకా ఎవడు ఏ పాపిష్టివాడు ఏ భయంకరదానం ఇచ్చినా విధినిషేధాలు లేకుండా చెయ్యిజాపాను. వారి పాపాలన్నీ మీద వేసుకున్నాను. అప్రతిగ్రహంగా జీవించవలసిన వేదవేత్తను ఇలా దానాలు పట్టేవాడిగా మారిపోయాను. పరహితం కోసం దానాలు పట్టినా ప్రాయశ్చిత్తాలు చేసుకున్నానా? లేదు. పోనీ అంటే నేనెవరికైనా ఏదానమైనా ఇచ్చానా? లేదు. అర్ధ లోభంతో నేను చెయ్యని దుష్కృత్యం లేదంటే నమ్ము. ఇతర ప్రదేశాలలో చేసిన దోషాలు కాశీలో గంగా స్నానంతో తొలగిపోతాయి. కానీ అవిముక్త క్షేత్రమైన కాశీలో చేసిన పాపాలు మేరు పర్వతాల్లా పేరుకుపోతాయే తప్ప ఏ పుణ్యకార్యానికీ కరగవు. అసలు నేను ఏ పుణ్యకార్యమైన చేస్తే గదా! రోజులూ వారాలూ నెలలూ సంవత్సరాలూ గడిచిపోయాయి. ముసలితనం వచ్చిపడింది. శరీరమన్నాక నేడో రేపో రాలిపోవలిసిందేగా. మరణించాను. అయితే అవి ముక్తక్షేత్ర మహిమవల్ల నేను నరకానికి పోలేదు. కాశీకి యమదూతలు రారు. ఎంతటి మహాఘోరపాపిష్టి అయినా కాశీలో మరణిస్తే నరకానికి పోడు, గర్భవాస క్లేశంలేని ముక్తిని పొందుతాడు. కానీ నేను చేసిన పాపాలన్నీ అవిముక్తంలోనే కనక అవి నన్ను ముక్తిని పొందనివ్వలేదు.. వజ్రలేపాలై తగిలి నిలిచాయే తప్ప విడిచిపెట్టలేదు. ఆ కారణంగా నీచ జన్మలు ఎన్నో ఎత్తాను. అయితే కాశీ క్షేత్ర మహిమవల్ల గర్భవాస క్లేశంలేని అయోనిజ జన్మలే లభించాయి. ఇది కాశీలో మరణించిన నావంటి పాపిష్టులకు శ్రీ భైరవానుజ్ఞ (పదమంజరీ వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి:) హిమాలయాల్లో గ్రద్దగా రెండు జన్మలు, వ్యాఘ్రంగా మూడు జన్మలు, సరీసృపంగా గుడ్లగూబగా మలభక్షక క్రిమిగా పందిగా ఒక్కొక్క జన్మ అయ్యి ఇదిప్పుడు ఈ రాక్షసరూపం పదవజన్మ. ఈ జన్మ ఎత్తి ఇప్పటికి డబ్బై అయిదువేల సంవత్సరాలయ్యింది. అయినా అతీగతీ లేదు. నాకు నిష్కృతి లభిస్తుందనిగానీ ఈ దుఃఖసాగరం నుండి విముక్తి పొందుతానని గానీ ఆశ కూడా లేదు. భద్రే! ఈ ముప్పాతిక వేల సంవత్సరాలలో ఏ పాపమూ ఎరగని ఎన్ని ప్రాణుల్ని భక్షించానో. మూడు యోజనాల మేర జంతు వేదైనా కనిపిస్తే ఒట్టు, పూర్తిగా నిర్జంతుకమైపోయింది. ఈ మహా పాపాలన్నీ అనుక్షణమూ నా హృదయాన్ని దహించివేస్తుంటే మనశ్శాంతి కరువై అలమటిస్తున్న నాకు నీ దర్శనం అమృత సేచనంగా లభించింది. కొసకొంగు నుంచి జారిపడిన నీటి బిందువు హృదయ శల్యాన్ని తొలగించింది. తీర్థయాత్రలూ, తీర్ధస్నానాలూ ఎప్పటికో ఫలిస్తాయట. సజ్జన సాంగత్యం మాత్రం తక్షణమే ఫలిస్తుందట. అందుకే మహాత్ములు ఈ సత్సంగతిని బహుధా కొనియాడుతుంటారు.


తల్లిగా ! నా దుఃఖాలా దుష్కృతాలూ అన్నీ నీ ముందు వెళ్ళబోసుకున్నాను. ఎదుటి వారి కష్టాలను కనీసం ఓపికగా వినిపించుకునే సజ్జనులు మరీ అరుదైపోతున్న రోజులివి. నువ్వు విన్నావు. అంతే చాలు. ఇక నేను చెప్పవలసింది ఏమిలేదు. ఈ దుఃఖసముద్రానికి ఆవలి తీరం ఎక్కడో జన్మపరంపరలకు ముగింపు ఎప్పుడో తెలిస్తే పుణ్యం - కట్టుకో, సజ్జనుల సంపద ఏదైనా అది పరులకోసమే అన్నారు. అందరికీ అనుభవించే హక్కు సమానమే అన్నారు. క్షీర సముద్రంలోని పాలు హంసలన్నింటికీ సమానంగా ఉపజీవనాలు కావడం లేదూ. అలాగేనటమరి.


No comments:

Post a Comment