Thursday 20 July 2023

శ్రీదత్త పురాణము (204)

 


సమిధలూ, దర్భలూ, ఏరుకు రావడానికి అడవిలోకి వెళ్ళిన పరశురాముడు ఈ సంఘటన జరిగిన కాసేపటికి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తండ్రికి నమస్కరించి కూర్చున్నాడు. సోదరులు చుట్టుముట్టి జరిగిన సంగతంతా చెప్పారు. వింటూనే పరశురాముడు క్రోధారుణ విఘూర్ణితనేత్రుడై ఉవ్వెత్తున లేచాడు. లేస్తూనే పర్ణశాలలో ప్రవేశించి గండ్ర గొడ్డలి విల్లంబులతో ఇవతలకి వచ్చాడు. వస్తూనే భూమి కంపించేట్టు ఆమడకు అంగవేస్తూ బయలు దేరాడు. అధర్మం చేసి భూమికి భారంగా మారిన హైహయుణ్ని సంహరించడానికి మాహిష్మతీనగరం చేరుకున్నాడు.


చతురంగ బలాలతో కార్తవీర్యుడు సరిగ్గా పుర ప్రవేశం చెయ్యబోతూ వుండగా వెళ్ళి వెనుక నుండి ఆటకాయించాడు !!!


ఓరీ క్షత్రియా ! నన్ను పరశురాముడంటారు. జగద్విఖ్యాతుణ్ని. ఏదీ నీ ముఖం చూపించు, అని మేఘ గంభీర స్వరంతో గర్జించాడు. ఆశ్చర్యచకితుడై అర్జునుడు పరశురాముణ్ని చూసాడు. చూస్తూనే త్రిభువనేశ్వరుడని గుర్తించాడు." భూభారం తగ్గించడానికి అవతరించిన శ్రీమన్నారాయణుడని గమనించాడు. అయినా క్షత్రియ ధర్మం ప్రకారం తన సైన్యాన్ని యుద్ధానికి పురికొల్పాడు. రాజాజ్ఞను శిరసావహించి ఆ క్షత్రియవీరులంతా రకరకాల భీకర ఆయుధాలతో పరశురాముడి మీదకు లంఘించారు. సూర్యుడు తన కిరణాలతో చీకట్లను నాశనం చేసినట్లు, రెప్పపాటు కాలంలో ఒంటి చేతితో పరశురాముడు ఆ చతురంగ బలాలను మట్టు బెట్టాడు. సైన్య నాశనానికి బాధ కలిగినా తన పరాక్రమమూ ఇంతటిదే కదా అని మురిసిపోయాడు కార్తవీర్యుడు. చేస్తే ఇటువంటి వాడితోనే యుద్ధం చెయ్యాలి. ఇన్ని వేలు సంవత్సరాలకి ఒక్కడు దొరికాడు. ఇంద్రాదులు సైతం ఇతణ్ని ఎదిరించి నిలబడలేరు. ఇతడి తోనే ద్వంద్వ యుద్ధం చెయ్యాలి. బలవీర్య పౌరుష పరాక్రమాలను సార్ధకం చేసుకోవాలి. నాకితడు సమానుడో అధికుడో తేల్చుకోవాలి. దత్తస్వామి ఇచ్చిన వరం ఉండనే ఉందికదా కనుక ఈ బ్రాహ్మణుడితో కలబడతాను - అని ఒక నిశ్చయానికి వచ్చాడు. ప్రళయ కాల సూర్యుడిలా సహస్ర బాహువులూ ధరించి హోర రూపుడై సహస్రాయుధాలను సంధించిన పరుశురాముని మీదకు విసిరాడు. మండిపడుతున్న గోళాళ్ళాంటి కష్ట సమూహాలను ఆ తపస్వి విభుడైన పరశురాముని మీదకు కురిపిస్తూ అతి భీషణంగా గర్జించాడు. ఆ ధ్వనికి విమోహితులై మానవులు ఎక్కడి వారక్కడే నేల రాలిపోయారు.


No comments:

Post a Comment