Monday 10 July 2023

శ్రీదత్త పురాణము (194)

 


బృహస్పతి బయలుదేరాడు. అతడి వెంట అందరూ కదిలారు. మేరుశిఖరం చేరుకున్నారు. స్వర్ణకమలాల కనువిందు చేసింది. ఏ స్వర్ణకమల కోటరంలో ఉన్నాడో మహానుభావుడు. బృహస్పతి ఎలుగెత్తి పిలిచాడు. వెంటనే ఇంద్రుడు బయటకు వచ్చాడు. వస్తూనే గురువుగారి పాదాలపై పడ్డాడు. కాపాడండి. నా పాపానికి నిష్కృతి చెప్పండి. బుద్ధి తక్కువై అహంకరించి పాడుపని చేశాడు. ఫలితం అనుభవిస్తున్నాను. కరుణించి తరుణోపాయం ఉపదేశించండి. గురుదేవా? అని మొరపెట్టుకున్నాడు.


చేసిన నేరానికి శిక్ష అనుభవించావు కనుక, తరుణోపాయం చెబుతున్నాను. పద, నేనూ వస్తాను. ప్రయాగ వెడదాం. అక్కడ త్రివేణీ సంగమంలో మునుగుదువుగాని వెంటనే పాప విముక్తి పొందుతావు.


బృహస్పతి వెంట బయలుదేరి ప్రయాగ చేరుకున్నారందరూ. గంగాయమునా సితాసిత జలౌఘంలో స్నానం చేశాడు దేవేంద్రుడు, పాప విముక్తి పొందాడు. బృహస్పతి సంతుష్టుడయ్యాడు. ఇంద్రా! పాప విముక్తుడవు అయ్యావు కాబట్టి నీకొక వరం ఇస్తున్నాను. ఈ క్షణం నుంచీ నీ శరీరం మీద ఈ సహస్ర భగచిహ్నాలు ఈక్షణాలుగా మారిపోతాయి. సహస్రాక్షుడవుతావు. బృహస్పతి ఈ మాట అనడమేమిటి దేవేంద్రుడి శరీరం మీద ఆ మార్పు వచ్చేసింది. పద్మాల్లాంటి సహస్ర లోచనాలు సాక్షాత్కరించాయి. సహస్ర కమలాల మానససరోవరంలాగా భాసించాడు. 


బృందారకులు జయజయ ధ్వానాలు చేశారు. మునీశ్వరులు మంగళాశీస్సులందించారు. గంధర్వులు స్తోత్రపాఠాలు వినిపించారు. అప్సరసలు ఆనంద లాస్యాలు ప్రదర్శించారు. అందరూ తిరిగి అమరావతికి చేరుకున్నారు. 


No comments:

Post a Comment