Wednesday 5 July 2023

శ్రీదత్త పురాణము (189)

 


జీవుడి ఆవిర్భావం నుండీ జన్మ జన్మాంతరాల్లో మనోవాక్కాయ కర్మలతో కూడబెట్టుకున్న మహాపాపరాశి అంతా ఇక్కడ మాఘ స్నానంతో పిడికెడు బూడిదయై నీళ్ళల్లో కరిగిపోతుంది. ఇక్కడ మూడు మాఘ స్నానాలు చేస్తే చాలు ఎంతటి నరాధముడైనా కుబుసంలా పాపాలను వదిలేసి పవిత్రుడై అమరధామం చేరుకుంటాడు. కురుక్షేత్రంలో ఎక్కడ గంగా స్నానంచేసినా ఇదే ఫలితం. ఇంతకన్నా వింధ్యాగంగా సంగమంలో నైతే పదిరెట్లూ, ఉత్తర వాహినిగా గంగ ప్రవహిస్తున్న కాశీలోనైతే వంద రెట్లూ, గంగా యమునా సంగమంలోనైతే అంతకన్నా నూరురెట్లూ. పశ్చిమ వాహినిగా గంగ ప్రవహిస్తున్నచోటనైతే వెయ్యిరెట్లూ అధికంగా స్నాన పుణ్యఫలం లభిస్తుంది.


అర్జునా! పశ్చిమ వాహినిగా ప్రవహిస్తున్న గంగానదిని దర్శిస్తే చాలు బ్రహ్మహత్యా మహాపాతకం కూడా తొలగిపోతుంది. పశ్చిమంగా ప్రవహించే గంగానది కాళిందిలో సంగమించినచోట మాఘ స్నానం చేస్తే కల్పకల్పాంతర సంప్రాపాలైన నిఖిల దోషాలూ ఆస్తమిస్తాయి. అందుకనే ఈ త్రివేణీ సంగమాన్ని "అమృతము" అని కల్పకల్పాంతరాల నుండీ కీర్తిస్తున్నారు మహర్షులు.


ఇక్కడ మాఘ స్నానముహుర్తం దేవతలకు సైతం కష్టసాధ్యం. అణిమాది గుణసిద్ధులైన యోగీశ్వరాలు బ్రహ్మజ్ఞానులూ, సతీసమేతులై హరి హర విరంచి పురందరులూ ఆదిత్యులూ మరుత్తులూ గంధర్వులూ, లోకపాలకులూ, యక్షులూ, గుహ్యకులూ, కిన్నెరులూ, నాగులూ అలాగే ఘృతాచీ మేనకా, రంభా, ఊర్వశి, తిలోత్తమా, ప్రభృతి అప్సరోబ్బందమూ, పితృదేవతా గణమూ అందరూ ఈ త్రివేణీ సంగమంలో మాఘస్నానం చేయడానికి వస్తారు. కృత యుగంలోనైతే స్వస్వరూపాల తోనూ కలియుగంలోనైతే ప్రచ్ఛన్న రూపాలతోనూ వచ్చి స్నానాలు చేసి వెడతారు. ఈ ప్రయాగలో ముమ్మారు మాఘస్నానం చేసిన వారు వెయ్యి అశ్వమేధాలకన్నా అధికపుణ్య ఫలం పొందుతారు. వెనకటికి కాంచన మాలిని ఇలాగే త్రివేణిలో మూడు నాళ్ళు మాఘ స్నానాలు చేసి సంపాదించుకున్న పుణ్యాన్ని ఒక రాక్షసుడికి ధారపోసింది. దానితో ఆ పాపాత్ముడు కలికల్మష విముక్తుడయ్యాడు.


దత్తాత్రేయుడినోట ప్రసంగవశాత్తూ ఈ మాట వచ్చింది. అంతే కార్తవీర్యార్జునుడు పట్టుకున్నాడు. స్వామి! స్వామి ! ఎవరీకాంచన మాలిని? ఎవడా రాక్షసుడు? వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు? ఆవిడ తన పుణ్యాన్ని ఎందుకు ధారపోసింది? తెలుసుకోవాలని కుతూహలంగా వుంది. అత్రి సంతతి భాస్కరా! అది పుణ్య ప్రదమైనదని నువ్వు భావిస్తే దయచేసి నా కుతూహలం దీర్చు.


No comments:

Post a Comment