Sunday 30 July 2023

శ్రీదత్త పురాణము (212)

 


జననీ! త్రిలోక వందితా! గాయత్రీ! వేదమాతా! కటాక్షించు. వేదాలను మరచిపోయాము ఏ ఒక్క మంత్రమూ గుర్తుకు రావడం లేదు. నువ్వు పరమేశ్వరివి. జగద్గురుత్వం నీది. సర్వదేవతా మయివి. నీ అక్షరరూపాన్ని నా బుద్ధిలో తిరిగి ప్రకాశింపజెయ్యి.


చతురాననా! వెళ్ళి దత్తాత్రేయుణ్ని అభ్యర్ధించు. అతడు వర్ణమాత్రా సహితంగా సకల విద్యలూ నేర్చినవాడు అని రేణుకా దేవి బ్రహ్మకు చెప్పి వెంటనే దత్తాత్రేయుణ్ని పిలిచింది. జ్ఞానవేత్ఛ పురస్కృతా! సర్వదేవ నమస్కృతా! ఈ బ్రహ్మ దేవుడు ఏదో అంటున్నాడు. కొంచెం కనుక్కో నాయనా అని చెప్పింది. అప్పుడు దత్త దేవుడు బ్రహ్మను సమీపించాడు. చతుర్ముఖా ! సర్వజ్ఞానవేత్తా! ఏమిటి అడుగుతున్నావో చెప్పు. నాకు తెలిసింది తప్పక చెబుతాను.


మునిశ్రేష్టా! వేదాలను, వేదాంగాలనూ, ఉపనిషత్తులను సమస్తమూ మరచిపోయాను. దయజేసి వర్ణమాత్రాస్వరాత్మాంకంగా వాటిని నాకు బోధించు. 


విరించీ! కకారాది సకల వర్ణాలలోనూ ఏకైకమై పరిఢవిల్లే అనంత వాదాత్మకత ఒక్కటే. అది ఎవరిలో ప్రకాశిస్తుందో ఆ దేవిని “సవర్ణ” అంటారు. ఆ సవర్ణ - ఈ రేణుకాదేవియే తప్ప మరొకరెవ్వరూ కాదు. సవర్ణ - వేదమాత - సావిత్రి- బ్రహ్మరూపిణి- అన్నీ ఆ జగద్ధాత్రి రేణుకాదేవియే. రెండవ శక్తి లేదు. ఏకమాత్ర ఏక వీర ఓంకారైక స్వర - అన్నీ ఆమెయే. అష్టపర్యాయక వాచక అని కూడా ఆమెను అంటారు. (హ్లాదిని విమల ఉత్కర్షిణి జ్ఞానయోగ ఇత్య ఈశాన ప్రసీ అనుగ్రహ అని అష్టపర్యాయ వాచకాలు) ఒక్కటే అయినా అనేక రూపాలు ధరిస్తుంది. - - - - కనుక ఏక వీర అన్నారు. ఆమెయే వేదమాత. గాయత్రి బ్రహ్మ రూపిణి.


మునిశ్రేష్ట ! సాధు, వేదమాత అన్నా, గాయత్రి అన్నా, బ్రహ్మ రూపిణి అన్నా ఒక్కరేనని చాలా చక్కని విషయం స్పష్టపరిచావు.


దత్తాత్రేయ చతుర్ముఖులు ఇలా సంభాషించుకుంటూ ఉండగానే దత్తదేవుడి అంకపీఠ నివాసినియైన శ్రీదేవి ముఖం నుంచి చతుర్వేదాలు వెలువడి రేణుకాదేవి శరీరంలో ప్రవేశించాయి. దీనితో సంతృప్తి చెందిన చతుర్ముఖుడు రేణుకాదేవియే వేద మాత అని గుర్తించి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు. తల్లీ! ఛందస్స్వరూపిణివి నీవు. ఓం కార స్వరూపిణివి నీవు. అనంత రూపిణివి నీవు. తెలిసిగానీ, తెలియక గానీ నిన్ను నిందించే వాళ్ళు సకల పుణ్య ఫలాలనూ కోల్పోతారు అని స్తుతించి మరొక్కసారి నమస్కరించి దత్తాత్రేయుడికి ప్రణమిల్లి పురాతన వేద స్మృతిని తిరిగిపొంది సత్యలోకానికి వెళ్ళిపోయాడు.


ఆ జగదంబికయే రేణుమహారాజు చేసిన తపస్సుకు సంతుష్టయై వారింట కన్యగా జన్మించి శివస్వరూపుడైన జమదగ్నిని పరిణయమాడింది. సేవలు చేసినది. ఆ దంపతులు కొంతకాలానికి లౌకిక దేహాలను విడిచిపెట్టి శివశివాని రూపాలతో కైలాసం తిరిగి చేరుకున్నారు. దీపకా! ఈ కధ నీకింతకు ముందే చెప్పాను కదా! అంచేత నీ మరో ప్రశ్నకి సమాధానం చెబుతున్నాను. తిలకించు అని వేద ధర్ముడు కొనసాగించాడు. -



No comments:

Post a Comment