Tuesday 4 July 2023

శ్రీదత్త పురాణము (188)

 


వేడి నీళ్ళతో ఆరేళ్ళపాటు మాఘస్నానాలు చేసిన పుణ్యఫలం ఒక్కసారి మకర వేళ పెరటి బావిచన్నీళ్ళతో స్నానించినందువల్ల లభిస్తుంది. పన్నెండేళ్ళు పెరటి బావి స్నానాల ఫలితం ఊరి వెలుపలి వాపీ కూపతటాకాల్లో ఒక్కసారి స్నానించినందునే దక్కుతుంది. తటాక స్నానంతో ద్విగుణంగా, పిల్లకాలువ స్నానంతో చతుర్గుణంగా, దేవఖాత స్నానంతో (కోవెలకోనేరు) దశగుణంగా మహానదీ స్నానంతో శత గుణంగా, నదీ సంగమ స్నానంతో చతుశ్శత గుణంగా గంగా స్నానంతో సహస్ర గుణంగా పుణ్యఫలం లభిస్తుంది. గంగానదిలో మకర నూఘస్నానం చేస్తే ఆ పుణ్యాత్ములు చతుర్యుగ సహస్రాంతాలకూ దేవలోకం నుంచి పతనం చెందరు. ఇదే స్నానాన్ని గంగా యమునా సంగమ స్థలంలో చేస్తే ఇంతకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ప్రతిరోజూ వెయ్యి సువర్ణ నిష్కాలను, లేదా వెయ్యి గిత్తలను, లేదా అయుత కపిల గోవులను దానం చేస్తే - వచ్చేపుణ్య ఫలం, గంగా యమునా సంగమంలో చేసిన ఒకే ఒక్క మాఘస్నానంతో కైవశమవుతుంది.


ప్రయాగ మహిమ


కార్తవీర్యా ! గంగా యమునా సంగమస్థలాన్ని ప్రయాగ అంటారు. ఇది మహా పాప సమూహాలకు దహన వాటికగా, పాపరూప పశువులకు విశసన స్థలిగా (గదేళా) బ్రహ్మ దేవుడు ఈ ప్రయాగను సృష్టించాడు. ఇది తెలుపూ (గంగ) నలుపూ (యమున) జలాల కూడలి. దీని గర్భంలో సరస్వతీ నది కూడా వుంది. అయితే అది అదృశ్యరూప. ఇలా ఇది త్రివేణీ సంగమం. బ్రహ్మలోకానికి ఇది మార్గం. ఈ సంగమస్థలంలో మకర రవివేళ మాఘ స్నానం చేసిన భాగ్యశాలికి మరెప్పుడూ ఏ గర్భకోశంలోనూ మునుగవలసిన అవసరం ఏర్పడదు. అపునర్భవమైన ముక్తిని పొందుతాడు. దేవతలకు సైతం దురాసదమైన వైష్ణవ మాయ కూడా మాఘంలో ఇక్కడ దగ్ధమవుతుంది. అంతటి శక్తి అంతటి పవిత్రతా ఉన్న తీర్ధ మీదొక్కటే, రకరకాల పుణ్యకార్యాలకు ఫలాలుగా దక్కిన ఆయా తేజోమయ లోకాలలో విహరించి భోగాలను అనుభవించిన పుణ్యజీవులు ఈ సంగమ తీర్ధంలో మాఘస్నానం చేసి శ్రీ మన్నారాయణుడిలో లీన మవుతారు.


మకర రవివేళ ఈ సీతాసిత జల సంధిలో స్నానం చేసినందువల్ల వచ్చే పుణ్యాన్ని గానీ, ఆ పుణ్యానికి తగిన స్థానాన్నిగానీ చిత్ర గుప్తుడైనా లెక్క కట్టి చెప్పలేదు. నూరేళ్ళ నిరాహార వ్రతానికీ, మూడు వందల ఏళ్ళ యోగాభ్యాసానికి కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయాన నూరు బారువుల బంగారం దానంచేసిన దానికీ వెయ్యి రాజసూయ యాగాలు నిర్వహించిన దానికీ లభించే పుణ్యఫలం ఇక్కడ ఈ త్రివేణిలో మూడు మాఘస్నానాలు చేస్తే చాలు వచ్చి ఒడిలో పడుతుంది. మరొక రహస్యం విను ఈ భూగోళం మీద వున్న సకల తీర్ధాలూ, సమస్త పుణ్య క్షేత్రాలూ ఈ త్రివేణిలో మాఘ స్నానానికి వేంచేస్తాయి. అప్పటి దాకా తమలో మునిగిన పాపాత్ముల కిల్బషాలతో నల్లబడ్డ ఈ తీర్ధాలు త్రివేణీ మాఘ స్నానంతో కిల్బషాలను పూర్తిగా వదిలించుకొని తెల్లబడతాయి.


No comments:

Post a Comment