అలనాడు దత్తాత్రేయుణ్ని సేవలతో మెప్పించి చాలా వరాలు పొందాడు. అందులో ముఖ్యమైనది తన మరణం గురించి సంగ్రామ రంగంలో నాతో సమానుడిచేతిలో గానీ, నాకంటే అధికుడు చేతిలో గానీ, నేను మరణించాలి. అంతేగానీ రోగాలూ, రొష్టులతోనో, అల్పుడి చేతిలోనో మరణించకూడదు అని వరం అడిగాడు. స్వామి తధాస్తు అన్నారు. ఈ మాట జరగాలికదా. అందుకు అవసరమైన కర్మాచరణను అతడితో ఈ బలీయమైన విధి చేయించింది. అది చెబుతాను. విను.
ఒకనాడు కార్త వీర్యార్జునుడు రధారూఢుడై చతురంగ బలాలతో భూగోళం అంతా విహరించి తిరిగి వస్తూ ఋచీక పుత్రుడైన జమదగ్ని ఆశ్రమాన్ని సందర్శించాడు. చతురంగ బలాలను ఆశ్రమానికి దూరంగా నిలిసి తానూ మరో ఇద్దరు మిత్రులూ కలిసి పాదచారులై ఋషి దర్శనం కోరి ఆశ్రమంలో ప్రవేశించారు. జమదగ్ని ఋషికి భక్తితో నమస్కరించి బద్ధాంజలితో స్తుతించి ఆయన ఆజ్ఞ ప్రకారం ఎట్ట ఎదుట శిలా వితర్థిక మీద వినయంగా కూర్చున్నాడు. ఉభయకుశలోపరి అయ్యాక ఆ మహర్షి కార్తవీర్యార్జునుణ్ని సర్వ సైన్య సమేతంగా అతిధ్యానికి పిలిచాడు. తన ఆశ్రమంలో ఉన్న హోమధేనువు సురభి మహిమతో అందరికీ అపూర్వమైన విందు విలాసాలూ దివ్యభోగాలూ అందించాడు. ఆ దివ్య భోగాలను చూసి ఆనందించవలసిన కార్తవీర్యుని మనస్సు విధి ప్రేరణతో ఈర్ష్యా కలుషితమయ్యింది. యావదఖండ పృధ్వీపతియై యుండి తాను ఏర్పాటు చేయలేని రీతిలో ఒక సాధారణ ఋషి విందు అందించడం తనకు పరాభవమని అనిపించింది. ఆ విందు విలాసాలూ భోగభాగ్యాలూ వాటికి అవేసాటి. స్వర్గ లోకంలో కూడా కన్నవి కావు విన్నవి కావు వీటిని తనకు అందించాడంటే ఇదితప్పక నన్ను అవమానించడమే. కించపరచడమే. ఈ పరాభవానికి మూల కారణం ఈ ఋషి దగ్గరున్న హోమధేనువు. దీన్ని ఇప్పుడే యాచించి సొంతం చేసుకుంటాను. దానంగా ఇవ్వనంటే స్వాధీనం చేసుకుంటాను. దీనికీ ఒప్పుకోకపోతే ఉండనే ఉన్నది. బలప్రయోగం - శాంతి పరాయణుడైన ఈ ఋషి నన్నేమి ఎదిరించగలడు? ఇలా ఒక నిశ్చయానికి వచ్చి ముందు వినయంగా ఋషిని అభ్యర్ధించాడు. ఫలించలేదు. ధనం కోరినంతా ఇస్తానన్నాడు. ఋషి అంగీకరించలేదు. అయితే బలాత్కారంగా తీసుకుపోతానన్నాడు. నీ వల్ల అయితే అలాగే తీసికెళ్ళు అని ఋషి శాంతంగా పలికి ఎప్పటిలాగే ప్రశాంతంగా కూర్చున్నాడు. హైహయుడు దూడతో సహా హోమధేనువును తాళ్ళతో బంధించి బలాత్కారంగా తన రాజధానికి లాక్కుపోయాడు.
No comments:
Post a Comment