Wednesday 9 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (19)


దంతాన్ని విరిచి కలంగా వాడాడు గణపతి. దంతం అంటే ఏనుగునకు మోజు కదా! అందువల్లనే బ్రతికినా చచ్చినా ఏనుగు వేయి వరహాలనే మాట వచ్చింది. ధర్మ ప్రబోధకమైన భారతాన్ని వ్రాయడానికి అట్టి దంతాన్నే విరిచి అనగా త్యాగం చేసి పూనుకున్నాడు. దేవగణాలకు పతి, పార్వతీ పరమేశ్వర తనయుడు, ప్రణవ స్వరూపుడైనవాడే తనను తాను తగ్గించుకొని వ్రాయసగాడయ్యాడు. చూసారా అతని త్యాగాన్ని?

మాణిక్య వాచకులు పాడుతూ ఉంటే నటరాజే వ్రాసేడని కథ. కృష్ణుడే జయదేవుని గీతగోవిందంలో ఒక వాక్యాన్ని వ్రాసేడని కథ. గణపతి, విసుగు చెందకుండా ఏకబిగిన లక్ష శ్లోకలూ వ్రాసాడు.  

అందుకే 'మహా గణాధిపతయే నమః' అని ముందుగా వ్రాస్తాం. గబగబా రాస్తూ ఉంటే అతని వేగాన్ని తట్టుకోలేక మధ్యమధ్యలో కొన్ని వ్యాస ఘట్టాలను పెట్టాడు వ్యాసుడు. వాటిని అర్థం చేసుకుంటూ వ్రాయాలనే నియమం కూడా పెట్టాడు.

గణపతి ముందు రెండు కణతలను తాడిస్తాం. గౌరవాన్ని చూపిస్తాం. వ్యాసుడే గణపతిని అప్పుడప్పుడు తలపట్టు కొనేటట్లు చేసాడు. తమిళ భాషలో వ్యాస ఘట్టాలు భారతగుట్టు అని అంటారు. గుట్టు అనగా రహస్యం. గుట్టు వీడిందంటే రహస్యం తెలిసిపోయిందని అర్థం. 

అతడు జ్ఞాన స్వరూపుడు కనుక క్లిష్టమైన శ్లోకాలను అర్థం చేసుకొని వ్రాసేడు. అట్లాగే క్లిష్టమైన సమస్యలు వీడిపోవాలని అతడిని స్మరిస్తాం. మన వార్త కూడా నిరాటంకంగా సాగిపోవాలని ప్రదక్షిణం చేద్దాం. 

No comments:

Post a Comment