Sunday 13 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (23)

దక్షిణ దేశంలో ఈ స్వామి సన్నిధి తిరువలంచుళిలోని శివాలయంలో ఉంటుంది. జ్ఞాన సంబంధులు, అప్పర్ ఇందలి ఈశ్వరుణ్ణి పాటలతో కీర్తించారు. కాని ఆ క్షేత్రం యొక్క కీర్తి వినాయకునకే చెందుతుంది. ఆ మంటపంలోని శిల్ప సంపద అత్యద్భుతంగా ఉంటుంది. పాలరాతి నగిషీలు ఇందు చెప్పుకోదగినవి.

పూర్వకాలంలో ఆలయాలను చెక్కిన శిల్పులు, ఐదింటిని మినహా ఏవైనా చెక్కగమని అనేవారట. ఈ ఐదింటిని శిల్పంలో చూపించడం తమకు అలవి కాని పని యని అనేవారట. అపుడయార్ కోవెలలోని వంపు తిరిగిన ప్రాకార శీర్ష శృంగము; గడారం కొండాన్ లోని ప్రాకారపు గోడ; తంజావూరు శిఖరం; తిరువిళిమలైలో నున్న మంటపం; అనే నాల్గింటితోబాటు తిరుపళించుని లోని పాలరాతి అల్లికల తడకలు కూడా చేర్చారు. వీటిని మరల నిర్మించడం సాధ్యం కాదని అనేవారట.

తిరువళంచులిలోని 16 రంధ్రాలు శిల్ప కళ శోభితంగా తొలచబడ్డాయి. 16 గణపతులున్నట్లే 16 రంధ్రాలుండడం విశేషం. 16 సంఖ్య, పూర్ణత్వాన్ని సూచిస్తుంది. షోడశకలాపూర్ణుడని అంటాం కదా.

దేవేంద్రుడు, ఇక్కడి వినాయకుని పూజించాడని ఐతిహ్యం. క్షీరసాగరంలోని అమృతంలా, పాలమీగడతో చేసినట్లుగా ఇక్కడ స్వామి తెల్లగా ఉంటాడు. కనుక శ్వేత వినాయకుడని పేరు. ఈశ్వరాలయంలో ఇతడు శివునితో పాటు ఒక సన్నిధిలో ఉన్నా ఇతనికే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి గాని శివునకు కాదు.

No comments:

Post a Comment