Friday 11 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (21)

ఈ వలంపురి క్షేత్రాలలో ప్రసిద్ధమైనది కుంభకోణం దగ్గర తిరువలం చూళిలో ఉంది. అతని గొప్పదనాన్ని ఇంకా వివరిస్తాను. మహారాష్ట్రలోని గణపతి పూజ విస్తారంగా జరుగుతుంది. ముందుగా వినాయకుణ్ణి చివరగా ఆంజనేయుణ్ణి కొలవడం అక్కడ విస్తారంగా ఉంటుంది. ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందించడానికి వినాయక ఉత్సవాలు తిలక్ గారు ప్రోత్సహించారు. పూజానంతరం భారీగా నిమజ్జనోత్సవం జరుగుతూ ఉంటుంది. ఇట్లా లక్షలాదిమందిలో దైవభక్తిని పరోక్షంగా దేశభక్తిని కలిగించారు. అది మత సంబంధమైనది కనుక తెల్లదొరలు కలుగజేసుకోలేదు. ఈ ఉత్సవాలలో నాయకులు వచ్చి దేశభక్తిని నూరిపోసే వారు. ఉత్తేజితుల్ని చేసేవారు. ఈనాటికీ ముంబైలో గణపతి ఆరాధన చెప్పుకోదగినదే. చాలామంది గణపతులను వివిధ రూపాలలో అర్చిస్తూ ఉంటారు.

గాణపత్యాన్ని అవలంబించినవారు గణపతి భక్తులు. వీరికి గణపతియే ఆరాధ్య దైవం. నదిలో ఆరు స్నాన ఘట్టాలున్నట్లు మన మతంలోనూ ఆరు సంప్రదాయాలున్నాయి. గాణాపత్యం - గణపతి; కౌమారం - కుమారస్వామి; శాక్తం - శాక్తేయులకు; వైష్ణవం - వైష్ణవులకు; శైవం-శివునికి; సౌరం - సూర్యునకు సంబంధించినది. ఈ ఆరింటిని ఉద్దరించి శంకరులు షణ్మతస్థాపనాచార్యులైనారు.

No comments:

Post a Comment