Tuesday 6 June 2023

శ్రీదత్త పురాణము (161)

 


కుమారా కార్తవీర్యా! యోగసిద్ధుడికి కర్మభయంలేదు. పూర్తిగా భయాతీతుడు. అందుచేత విధినిషేధాలు ఇతడికి సమానం. నిషిద్ధ కర్మలు అని ప్రక్కన పెట్టడు, విహితసత్కర్మలు అని చేపట్టడు. పసిబిడ్డలాగా ప్రవర్తిస్తూ వుంటాడు. ఇతడు ఆత్మరతుడు. ఆత్మ తృప్తుడు. ఇతడికి ఆచరించదగిన కర్మ అంటూ ఏదీ వుండదు. ఆచరించినందువల్ల లాభంగాని ఆచరించనందువల్ల నష్టంగానీ ఏదీ యోగికి ఉండవు, అసలు ఇతడికి ఈ సమస్తంలోనూ ఏ ప్రయోజనం లేదు. ఈ లోకంలో ఇద్దరే ఇద్దరు ఎల్లవేళలా పరమానందంలో మునిగి తేలుతుంటారు. ఒకడు యోగ యుక్తుడైన కర్మ భయాతీతుడు. ఇంకొకడు- బుద్ధి కూడా అందని స్థానాన్ని అంటే బ్రహ్మైక్యాన్ని పొందినవాడు.


కార్తవీర్యా! ఇక ఇంటికి వెళ్ళు నీ రాజ్యాన్ని నువ్వు పాలించు. రక్షించు. అది నీ ధర్మం యజ్ఞాలతో దేవతల్ని శ్రాద్ధాలతో పితృదేవతల్ని దాన ధర్మములతో బ్రాహ్మణులను సంతృప్తి పరచు. అప్పుడప్పుడూ దర్శనానికి వచ్చి నన్ను ఆనంద పెట్టు, అవ్యగ్ర చిత్తుడవై నన్ను నిరంతరం స్మరిస్తూవుండు. నేను బోధించిన జ్ఞానాన్ని, నేను కలిగించిన అనుభవాన్ని ఏనాడూ మరచి పోకూడదు సుమా! ఏకాగ్ర చిత్తంతో తత్వాన్ని ధ్యానించు. ఇంకా నేనేమి చెప్పానో అన్నింటినీ ఆచరించు. వెళ్ళిరా.


దత్తస్వామి ఇలా ఆజ్ఞాపించేసరికి కార్తవీర్యార్జునుడు మరొక్క మారు సాగిలపడి మ్రొక్కి లేచి మనసంతా ఆనందంతో పులకరించిపోతూ వుండగా కళ్ళవెంబడి ఆనంద భాష్పములు చిమ్ముతూ ఉండగా అక్కడ వున్న ఋషి మండలికి ప్రదక్షిణంచేసి, నమస్కరించి అందరి ఆశీస్సులు అందుకొని సెలవు తీసికొని బయలుదేరాడు.


వెనక్కి వెనక్కి తిరిగిచూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాడు. మాహిష్మతీనగరం చేరుకొని యధావిధిగా పరిపాలన సాగించాడు. గురూపదేశాన్ని అక్షరాలా పాటిస్తూ రాచకార్యములు నిర్వహిస్తున్నాడు. 


సంవత్సరకాలం గిర్రున తిరిగిపోయింది. ఒకనాడు బయలు దేరి సహ్యాద్రి పర్వతానికి చేరుకుని స్వామి దగ్గరకు వచ్చి దత్తస్వామికి అక్కడ వున్న మునిజనులందరికీ నమస్కరించాడు. స్వామి ఆదరంగా దగ్గరకు పిలచి చేరువలో కూర్చోపెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు అయినాయి. నాయనా! ఏదో అడగాలని వచ్చినట్లున్నావు. సంశయం దేనికి? అడుగు అని ప్రోత్సహించేసరికి కార్తవీర్యుడు సవినయంగా తన సందేహాన్ని ఇలా బయటపెట్టాడు.   


No comments:

Post a Comment