Monday 12 June 2023

శ్రీదత్త పురాణము (167)

 


ఈ వ్యాపకంలోనే అతడికి తెలియకుండానే వయస్సు గడిచిపోయింది. చెవుల దగ్గర జుట్టు తెల్లబడింది. ఓహో వార్ధక్యం ముంచుకొస్తోంది అని గ్రహించాడు. ఒక్క నిముషం గాఢంగా ఆలోచించాడు. సంపాదించిన ధనంలో ఆరవవంతు తీసి చకచకా ధర్మ కార్యాలు చేసాడు. శివ-విష్ణుదేవాలయాలు కట్టించాడు. సముద్రం అంతటి చెరువు త్రవ్వించాడు. నూతులూ, దిగుడు బావులూ, సరోవరాలు, అనేకం ఏర్పాటు చేయించాడు. వట-అర్క-అశ్వత్థ-కంకేళీ-జంబూ-నీపాది వృక్షాలతోవనాలు, పుష్పతరులతానికుంజాలతో ఉద్యానవనాలు పెంపొందింపజేసాడు. ఉదయం నుండి సాయంకాలం వరకు నిత్యమూ నిరతాన్న దాన పథకం అమలు జరిపాడు. నగరం వెలుపల నాలుగు దిక్కులా అందంగా చలివేంద్రాలు ఏర్పాటుచేసాడు. పురాణాలు చెప్పిన షోడశమహాదానాలు చెయ్యమన్న వేళ చెయ్యమన్న చోట చెయ్యమన్న తీరుగా చేసాడు.


చివరకు యావజ్జీవ ప్రాయచ్ఛిత్తం కూడా యధావిధిగా జరిపించుకున్నాడు. యోగ్యులు సమర్ధులు అయిన తన కుమారులు శ్రీకుండల— వికుండలుల కిద్దరికీ ఇల్లు వాకిలీ మిగిలిన సంపదా అప్పగించి తాను భార్యతో కలసి వాన ప్రస్తానికి వెళ్ళిపోయాడు. అక్కడ గోవింద నామస్మరణ జేస్తూ తపోనియమాలతో దేహాన్ని కృశింపజేసి ఒక శుభగడియలో అనాయాసంగా విష్ణు సాయుజ్యం పొందాడు.


కొడుకుల హయాం వచ్చింది. దానధర్మాలు బందు అయిపోయాయి. సహాయ సహకారాలు అంతరించిపోయాయి. అహంకారమూ అతిశయమూ ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడ్డాయి. పొగడ్తలతో లోబరుచుకొని అక్రమాలు, అన్యాయాలు చేయించేవాళ్ళు చుట్టూతా చేరారు. అన్నదమ్ములిద్దరూ దుర్వ్యసనాలలో పూర్తిగా చిక్కుకుని పోయారు. అమ్మచెప్పినా బంధువర్గం చెప్పినా హితం కోరి తండ్రి, స్నేహితులు, జ్ఞానవయోవృద్ధులూ చెప్పినా అన్నదమ్ముల చెవులకు ఏమంచీ ఎక్కలేదు. వీరిని దగ్గరకు చేరనివ్వలేదు. గానా బజానాలతో, మేజువాణీలతో, విటవిటీ గోష్టులతో తందాన గాళ్ళతో (స్తోత్ర పాఠకులు) రేయింబవళ్ళు ఒక్కలాగా గడుపుతున్నారు. విలువైన వస్త్రాలు, ఖరీదైన ఆభరణాలు, సుగంధపరిమళ ద్రవ్యాలు, కస్తూరీ చందనాలు, మల్లికా కుసుమ మాలలు, ముత్యాల దండలు, గజ వాణీరధ క్రీడలు, సజీవ నిర్జిన ద్యూతాలు, మధు పానాలు, మాంస భక్షణలు, వార స్త్రీ సంభోగాలు, పరదారాభి గమనాలు, వీటిన్నింటికోసం ధనాన్ని మంచి నీళ్ళలా ఖర్చుపెట్టారు. వంద ఇవ్వవలసిన చోట వెయ్యి విసిరారు. వార - స్త్రీ నిట శైలూష మల్ల చారణ నంది బృందాలు బాగా బాగుపడ్డారు. అనవసర అసత్కార్యన్యయాలతో - - పిత్రార్జితమంతా ఊసర క్షేత్రంలో పోసిన విత్తనాలయ్యింది. సభ్య సమాజంకోసం ఖర్చుపెట్టలేదు. బ్రాహ్మణముఖతః ఖర్చుపెట్టలేదు. సర్వ పాప వినాశకుడైన శ్రీ మహావిష్ణువు సమార్చనకోసం ఖర్చు చేయలేదు. కానీ ధనమంతా ఖర్చయిపోయింది. వాళ్ళకే తెలియకుండా వ్రేళ్ళ సందుల నుండి జారిపోయింది. తమ తండ్రి దశాబ్దాలు శ్రమపడి కూడబెట్టిన సొమ్మును కొడుకులిద్దరూ రెండేళ్ళలో ఖర్చుపెట్టారు. అలవాట్లకు అవసరాలకు ధనం కావలసివచ్చింది. స్థిరాస్థులు కరిగిపోయాయి. ఆ తర్వాత ఆభరణాలకు, విలువైన సామాగ్రికి కాళ్ళు వచ్చాయి. ఇంతకాలమూ తమ చుట్టుతా చేరి భజన చేసిన బృందాలన్నీ మాయమయ్యాయి. ఉద్యోగులూ, సేవకులూ అందరూ వదలి వెళ్ళారు. అన్నదమ్ములిద్దరూ మిగలారు. ఆ ఇంటిలో ఆకలికి ఇవేమీ తెలీవు కదా! స్థితిలో వచ్చిన హెచ్చు తగ్గులు దానికేమి తెలుస్తాయి. లోలోపల అది దహించివేస్తోంది. ఇరుగు పొరుగుఇళ్ళల్లో చిన్న చిన్న దొంగతనాలు మొదలు పెట్టారు. ఇది నలుగురికీ తెలిసి ఛీ ఛీ అన్నారు. లోకానికి భయపడి, రాజదండనలకు భయపడి అన్నదమ్ములు ఇద్దరూ ఊరు వదలి అడవికి పారిపోయారు. అక్కడ రకరకాల జంతువుల్ని వేటాడి పక్షుల్ని సంహరించి పళ్ళూ ఫలాలూ తిని కొన్ని సంవత్సరాలు హాయిగా జీవనయాత్ర సాగించారు. వేట - మాంసం ఈ వైశ్యకుమారులిద్దరూ భిల్లవీరుల్లా తయారయ్యారు. మనస్సులో కోమలత్వం పోయి క్రూరత్వం చోటు చేసుకుంది. చిట్టిపొట్టి జంతువుల్ని విడిచి పెట్టి సింహశార్దూలాలని వేటాడటం మొదలు పెట్టారు. ఇద్దరూ పోటీలు పెట్టుకొని క్రూర మృగాల్ని వేటాడుతున్నారు. ఆనందిస్తున్నారు.


No comments:

Post a Comment