Saturday 10 June 2023

శ్రీదత్త పురాణము (165)

 


దైత్య వీరుల ముక్కు పుటాలు ఆశ్చర్యంతో ఆనందంతో స్పందించాయి. స్కంధావారంలో (దైత్యసైన్యం) కలకలం బయలు దేరింది. ఆ దివ్య పరిమళం ఎక్కడిదో ఎవరిదో తెలుసుకుందామని దైత్య గూఢచారులు నాసికలు విప్పార్చుకొని తీరం వెంబడి ఎగువకు నడక సాగించారు. అశోకవనం చేరుకున్నారు. అప్పటికి తిలోత్తమ స్నానం ముగించి మంకెన పువ్వులాంటి నాజూకు చీరను కుచ్చిళ్ళుపోసి కట్టుకొని అదే రంగు రవిక తొడుక్కుని నల్లని సిగలో తెల్లని మాలతో కుసుమాలు ధరించి కదులుతున్న కంకణాలూ వదరుతున్న నూపురాలు గునుస్తున్న మణి మేఖలా ధరించి గుండెల మీద ఎగిసిపడుతున్న ముత్యాల దండలతో చిరుగాలికి లాస్యం చేస్తున్న నీలి ముంగురుతో ఆ కంకేళీ వృక్షం మొదటి శిలా వితర్ధిక మీద ముద్దుగా, వయ్యారంగా కూర్చుని వీణను పలికిస్తోంది. దానితో తనూ స్వరం కలిపిపాడుతోంది.


చంద్రకళలాగా హృదయాన్ని పరవసింపజేస్తున్న తిలోత్తమను నైత్యభటులు చూసారు. ఆశ్చర్యచకితులై ఆనందపులకితులై చూపారు. క్షణంలో తేరుకొని పరుగు, పరుగున వెళ్ళి సుందోపసుందులకు విన్నవించారు. దేవతాంగనా? దానవాంగనా? నాగాంగనా? యక్షాంగనా? ఏమో తెలీదు. కానీ నారీ రత్నం. సర్వోత్తమ సర్వదా ఉత్తమ. మీరు రత్న భోక్తలు. సృష్టిలో ఉత్తమమైన ఏ వస్తువైనా మీకు స్వాధీనం కావలసిందే. ఆమె నారీ రత్నం. ఇక్కడికి చేరువలోనే ఆశోక వనంలో ఒంటరిగా కూర్చొని ఉంది. జగన్మోహనంగా వీణ పలికిస్తోంది. తానూ పాడుతోంది. మన్మధుణ్ని సైతం మోహింపజేసే సౌందర్యం. ఇంతకన్నా మేము వర్ణించలేము. బయలు దేరండి. మీ కళ్ళతో మీరు చూడండి.


గూఢచారులు ఇలా చెప్పేసరికి సుందోపసుందులు బయలు దేరారు. సుందుడు తాగుతున్న మధువును విసిరేసి ఒక్క ఉదుటున నిలబడ్డాడు. అప్పరాంగనలతో కృత్రిమ సరోవరంలో జలకేళి సలుపుతున్న ఉప సుందుడు కూడా మదగజం లాగా గట్టుకి వచ్చాడు. ఇద్దరూ వెడదాం అంటే వెడదాం అనుకున్నారు.


కాల దండాల్లాగా భయంకరమైన ఇనుప గదలను భుజాలకెత్తుకొని ఎడమ చేత్తో మీసాలు త్రిప్పుతూ భూమి దద్దరిల్లేలాగా అడుగులు వేస్తు రెండు మహాపర్వతాల్లాగా సుందోపసుందులు బయలు దేరారు. వీరిద్దరిని సంహరించడానికి వచ్చిన చండికలా కూర్చున్న తిలోత్తమ దగ్గరకు వచ్చారు. ఆమె సౌందర్యం ఆమె గాన మాధుర్యం వారిద్దరిలోన మన్మధాగ్నిని మరింత ప్రజ్వలింపజేసింది. సోదరా! పోటీకి రాకు. ఈ సుందరిని నేను స్వీకరిస్తాను. అంటే నేనే స్వీకరిస్తాను అని ఇద్దరూ వివాదపడ్డారు. అది చిలికి చిలికి గాలివానగా మారింది. గదా యుద్ధంగా మారింది. కాల మహిమ. పరస్పరం చావబాదుకున్నారు. చివరికి సుందోపసుందులు ఇద్దరూ ప్రాణాలు వదిలారు. అయ్యో ! ఈ మహాతల్లి ఎవరో ? ఈవిడ కోసం మన ప్రభువులు ఒకరినొకరు చంపుకున్నారే అని దైత్యసైన్యం విలపించింది. వజ్రాయుధం నిశ్శబ్దంగా పర్వత శిఖరాలను కూల్చినట్లు ఇద్దరినీ మడియించిన తిలోత్తమ దశదిశలకూ తన వీణా నాదంతో ఈ శుభవార్తను అందిస్తూ ఆకాశానికి ఎగిరిపోయింది. బ్రహ్మలోకం చేరుకుంది.


No comments:

Post a Comment