Saturday, 1 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 208 వ భాగం



పద్మపాదులు, శంకరుల సూత్రభాష్యంలో ఐదు అధికరణాలకు భాష్యం వ్రాసేదని, అది పంచపాదిక యని చదువుకున్నాం. ప్రకాశాత్ముడు, పంచపాదికపై వివరణ వ్రాసేడు. దీనిని వివరణ ప్రస్థానమంటారు. వాచస్పతి మిత్రులు, సూత్ర భాష్యంపై భామతి యనే పేరుతో భాష్యం వ్రాసేరు. ఇందు చెప్పబడిన వాటిని భామతి ప్రస్థానమంటారు.


వివరణ పద్ధతిని ప్రతిబింబవాదమని; భామతి సిద్ధాంతాన్ని అవచ్చేద వాదమని అంటారు. ఈ రెండూ పరమాత్మకు, మనకు భేదం లేదని చెప్పేవే.  

నేలపై కొన్ని నీళ్ళను చల్లామనుకోండి. అనేక జలకణాలు నేలపై ఉంటాయి. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. అన్నిటిలోనూ ఆకాశంలోని ఒక్క సూర్యుడూ వీటిల్లో చిన్నవాడుగా, పెద్దవాడుగా ప్రతిబింబిస్తూ ఉంటాడు. నీటికణాలు నేలలో ఇంకిపోతే ప్రతిబింబాలుండవు. అవిద్య నీటి వంటిది. అట్లా పరమాత్మ జీవుల అంతఃకరణాలలో లేదా మనస్సులలో ప్రతిబింబిస్తాడు, జీవాన్నిస్తాడు. ఇక అంతఃకరణం పోతే ప్రతిబింబం ఉండదు. బింబం ఒక్కటే ఉంటుంది. బింబమైన పరమాత్మ, రెండు లేనిదై ప్రకాశిస్తుంది. దీనిని బింబ ప్రతిబింబ వాదనుంటారు.


ఇక అవచ్చిన్నవాదం. ఆకాశం అంతటా ఉంది. దీనిని మహాకాశం అంటారు. కుండలోని ఆకాశాన్ని ఘటాకాశమంటారు. కుండ ఉన్నంత వరకూ ఘటాకాశముంటుంది. అది పగిలిపోతే మహాకాశమే ఉంటుంది. ఘటం పగిలినపుడు ఘటాకాశం మహాకాశం ఒక్కటైనట్లుగా మనస్సు నశిస్తే ఒక్క పరమాత్మయే యుంటాడు. కుండలో ఉన్నది చిన్న ఆకాశంగా, బయట ఉన్నది పెద్దదిగా కన్పిస్తుంది. కుండలు, మహాకాశాన్ని పంచుకున్నట్లుగా ఉంటాయి. ఇది అవచ్ఛిన్న వాదం.


మరొక ఉదాహరణ చూపిస్తారు. ఒక కుండను నీటిలో ముంచాం. అది నీటితో నిండింది. అందులోనున్నది, నూతిలో నున్నది నీరే. కాని కుండ ఒక హద్దును సృష్టిస్తూ, కుండలో నున్న నీటిని నూతిలో నున్న నీటిని వేరు వేరుగా చూపిస్తోంది. పెద్ద కుండలో ఎక్కువ నీరు, చిన్న కుండలో తక్కువ నీరు ఉన్నట్లు కన్పింప చేసినట్లు ఒకే పరమాత్మ, జీవుల యొక్క అంతః కరణాలను బట్టి భిన్న భిన్నంగా కన్పిస్తాడు.  


వీరి వాదాలతో మనకు పనిలేదు. నీళ్ళ చుక్కలను తొలగిస్తే ఉన్నది ఒక్క సూర్యుడే. మాయవల్ల ఏర్పడిన జీవాత్మ భావాన్ని తొలగిస్తే మనమూ, పరమాత్మ ఒకటౌతాము. ఇది ప్రతిబింబవాదం వారనేది. ఇక కుండ పగిలితే మహాకాశమైనట్లని అవచ్ఛిన్నవాదం వారంటారు.


No comments:

Post a Comment