Wednesday 19 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 226 వ భాగం



ఐదు ప్రధాన మఠాలను, ఇంకా చిన్న మఠాలను శంకరులు స్థాపించారని ఉన్నా రామేశ్వరంలో ప్రధాన మఠాన్ని స్థాపించకుండా చిన్న మఠాన్ని స్ధాపించారు. మహమ్మదీయుల దండయాత్రలో చిన్నమఠాలు ధ్వంసమైపోయాయి. ప్రధాన మఠాలకు వీరి తాకిడియున్నా అవి పూర్తిగా అదృశ్యం కాలేదు. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించారు. లేదా ఆ మఠాలను కొంతకాలం మూసి యుండవచ్చు. మన కంచి మఠాన్ని ఉడయార్ పాలయానికి, తరువాత కుంభకోణానికి మార్చారు. జోషీ మఠాన్ని (బదరి) కూడా కొంతకాలం మూసియుంచి తరువాత తెరిచారు.


రామేశ్వరంలో ప్రధాన మఠమే కనుక ఉంటే అది కనుమరుగైన పరిస్థితి యుండేది కాదు. అందువల్ల శృంగేరిలోనిదే ప్రధాన మఠంగా పరిగణింప బడింది. అయితే దీనిని తమ యూహ ప్రకారం ఏర్పాటు చేయలేదు. అదంతా దైవికంగా జరిగింది. విద్యా దేవతయే ఇక్కడ మఠాన్ని నెలకొల్పునట్లు చేసింది. ఈ మఠానికి ప్రత్యేక క్షేత్రం, రామక్షేత్రం అనగా 

రామేశ్వరమే. కంచి ప్రపంచానికి నాభి వంటిది కనుక అక్కడొక మఠాన్ని స్థాపించారు. ఇవి ప్రధానమైనవి. శారదా సంకల్పానుగుణంగా శారదా మఠం ఏర్పడింది.


సురేశ్వరుల ప్రత్యేక వ్యక్తిత్వం


మానవ స్వభావం ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. శంకరుల శిష్యులు, సురేశ్వరునే శంకించారు. శంకరుల శారీరక భాష్యానికి వివరణ వ్రాసే సురేశ్వరులు గురించి శంకరులతో శిష్యులు "అతడు పూర్వాశ్రమంలో గొప్ప మీమాంసకుడు కదా, మీ చేత ఓడింపబడ్డాడు. తప్పనిసరై మీకు శిష్యుడు కావలసి వచ్చింది. అతడు, అద్వైత వేదాంతాన్ని హృదయ పూర్వకంగా తమ రచనలలో ప్రతిపాదిస్తాడంటారా? మీ మాదిరిగా బ్రహ్మచర్యం నుండి ఆశ్రమ స్వీకారం చేయలేదు కదా. అతనికి తత్త్వం ఒంటబట్టిందా? సిద్ధాంతానికి చేటు తీసుకొని వస్తాడేమో!" అని గొణిగి యుంటారు. సురేశ్వరులు వీరి హావభావాలను చూసి వ్రాయడానికి పూనుకోలేదు.


No comments:

Post a Comment