Tuesday 11 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 218 వ భాగం



'స్వకర్మణా తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః" (18-46) 


ఇది చిన్న స్థాయిలో ఒక సిద్ధి వంటిది. ఇక కర్మలను విడిచి జ్ఞాన విచారంలో గట్టిగా అడుగిడినపుడు అది మహాసిద్ధి మోక్షం ప్రాప్తిస్తుంది.


'నైష్కర్మ్య సిద్ధిం పరమం సన్న్యాసేన అధిగచ్ఛతి" (18-49) 


నైపుర్ణ్య సిద్ధియే పరమసిద్ధి. అది సన్న్యాసియైన వెనుక సిద్ధిస్తుందని అన్నాడు. కనుక పరిపక్వమనస్సు లేనివారు కర్మలను చేయాలన్నాడు. అదైనా శాస్త్రం ప్రకారం అన్నాడు. అంతేనే కాని కర్మలను చేయడమే అంతిమ లక్ష్యమని చెప్పలేదు. చిట్టచివరి దశలోనే అన్ని కర్మలనూ విడిచిపెట్టుట:


"ఆరురుక్షో మునేర్యోగం కర్మకారణ ముచ్యతే

యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే (6-3)


అన్ని కర్మలు, బ్రహ్మజ్ఞానికి సాధనంగా ఉండి అందులో లీనమై పోతాయి. 


"సర్వం కర్మాఖిలం పార్ధ జ్ఞానే పరిసమాప్యతే" (4-33) 


జ్ఞానికి కర్మతో పని లేదు. 


"తస్య కర్మన విద్యతే" (3-17) అని సారాంశం గీతాచార్యుడందించాడు.


ఇట్లా కుమారిలునకు శంకరులు బోధ చేసారు. ఉపనిషత్తులలో కర్మయోగం ఉన్నా అదే అంతిమ లక్ష్యం కాదని అన్నారు. ఈశావాస్యం ఆరంభ మంత్రంలో జీవించిన వంద సంవత్సరాలు కర్మలు చేస్తూ ఉండాలని ఉంది. "జిజీవిషేత్" అని కూడా ఉంది. అంటే ప్రాపంచిక జీవితం కావాలనుకున్న వానికని అర్ధం. అంతేనే కాని నివృత్తి మార్గంలో ఉన్నవానికని కాదు. దీనితో శంకరులు ఏకీభవించారు. దీని వెనుక మంత్రంలో ఆత్మను, తెలుసుకొనలేనివాడు, అనగా జ్ఞాన మార్గాన్ని గుర్తించనివాడు, ఆత్మహత్య చేసుకున్నవానితో సమానమని ఉంది. తరువాత ఆత్మ గురించి అద్వైత ధోరణిలో వివరింప బడింది. కనుక జ్ఞాన మార్గానికి ముందు అనగా ప్రాథమిక దశలో కర్మమార్గం ఉంది.


కుమారిలునకు ఈ విధంగా శంకరులు ఉపదేశించారు. క్రియలలో మునిగినా, తన నిష్క్రియత్వ లక్ష్యాన్ని శాంత స్థితిని మరిచిపోలేదు. అది పనిచేస్తూ చేయని స్థితి. అది ఎట్టిదో వారి నడవడికవల్ల తెలుస్తుంది.


No comments:

Post a Comment