Sunday 2 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 209 వ భాగం



ఆ చండాలుడు, రెండు రకాల వాదాలను పేర్కొన్నాడు. 'కింగంగాంబుని' అనినపుడు, ప్రతిబింబవాదాన్ని పేర్కొన్నాడు. గంగ నీటిలో, చండాలవాటిక నీటిలో సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు కదా! రెండు ప్రతిబింబాలలోనూ తేడా ఉందా? తరువాత అవచ్ఛిన్న వాదాన్ని పేర్కొన్నాడు. రాజుగారి బంగారు కలశంలోనూ ఆకాశముంది. మా మట్టికుండలోనూ ఆకాశముంది. ఈ రెంటి ఆకాశాలకు తేడా ఉందా? బ్రాహ్మణ శరీరమైనా, చందాల శరీరమైనా కుండవంటిదే. లోనున్న ఆత్మకాశానికి తేడా ఉందా? రెండు శరీరాలు నీటి చుక్కలు వంటివే. రెంటిలోనూ ఆత్మ సూర్యుడొకడే.


లోనున్నది జ్ఞాన సముద్రమే సహజానంద అవబోధఅంబుధి. అది తరంగాలు లేని సముద్రం. సంసార సముద్రం తరంగాలతో ఉంటుంది. జ్ఞాన సముద్రానికి అవి ఉండవు. ఇది అంతటా వ్యాపించింది. దీనిపై మామూలు గాలి, తన ప్రభావాన్ని చూపదు. మామూలు సముద్రం, నీళ్ళతో, ఉప్పుతో ఉంటుంది. ఆత్మ సముద్రంలో జ్ఞానానందాలే ఉంటాయి. జ్ఞానమే ఆనందం ఆనందమే జ్ఞానమని అర్థం చేసుకోవాలి. ఇది వ్యాపించని చోటుండదు. కాని మామూలు సముద్రం అట్లా కాదు. ఇది అందరిలోనూ ఉంది. బాహ్య భేదాన్ని చూడమని నీ వేదాంతం చెప్పిందా? అని అడిగాడు. ఓహో! నీవు బ్రహ్మవేత్తవు. ఇట్టివారు ఎవరైనా మా గురువులే, నీ జ్ఞాన స్థాయిని తెలిసికోలేక ఆచారం ప్రకారం తొలగుమని అన్నా. నేను నీకు నమస్కరిస్తున్నా అని ఐదు శ్లోకాలు చెప్పారు. శంకరులు. దీనినే మనీషా పంచకమంటారు.


"జాగ్రత్ స్వప్న సుమస్తిమ స్ఫుటతరా సంవిత్ ఉజ్జృంభతే

యాబ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణీ

సైవాహం నచ దృశ్య వస్త్వితి దృఢప్రజ్ఞాఽపి యస్యాస్తిచేత్

చండాలోఽస్తు సతుద్విజోజస్తు గురురిత్యేషా మనీషామమ" 


జాగ్రత్ స్వప్న సుషుప్తులలో ఏ చైతన్యం అత్యంత స్పుటంగా ప్రకాశిస్తూ ఉందో, పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ ఏది ఓతప్రోతంగా (పడుగు పేకలుగా) అన్ని శరీరాలలోనూ వ్యాపించి సాక్షిగా ఉందో, నేనా చైతన్య స్వరూపాన్ని, నేను జడదృశ్యాన్ని కాను అని ఎవనికి గట్టి జ్ఞానం కలుగుతుందో, అతడు చండాలుడే అవుగాక, ద్విజుడే అగుగాక, అతడు నాకు గురువు. ఇది నిశ్చయం.


No comments:

Post a Comment