Sunday 23 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 229 వ భాగం


హస్తామలకుడు మౌన జ్ఞాని


శంకరుల ముఖ్య శిష్యులలో హస్తామలకుడొకడు. శిష్యుడని విడిగా చూడడం సబబు కాదు. శంకరులను, శిష్యులను విడదీయడమా? వారు నల్గురు శిష్యులతో అవతరించారని ఉంది కదా! కాని గురు శిష్య సంబంధం ఉంటుంది కనుక విడివిడిగా వీరిని గురించి ముచ్చటించుకుంటున్నాం. శంకరులు యాత్ర చేస్తూ ఉన్న సమయంలో పశ్చిమ తీరానికి చెందిన శ్రీబలిలో ఇతట్టి చూసారు. వయస్సు వచ్చినా ఎట్టి జ్ఞానమూ అబ్బలేదు.


చెవిటి, మూగ బాలునిగా ఉండేవాడు. తండ్రి, ఇతణ్ణి తీర్చి దిద్దండని శంకరులను వేడుకున్నాడు. ఇతణ్ణి జడుడని అన్నాడు. బ్రహ్మ జ్ఞాని కూడా జడునిగానే యుంటాడు. కాని ఇతణ్ణి జ్ఞానిగా శంకరులు గుర్తించారు.


గొప్ప జ్ఞానికి, గొప్ప అజ్ఞానికి భేదం తెలియదు. అజ్ఞానికి బుద్ధి పని చేయదు. ఒక మూర్ఖునిలా ఉంటాడు. కొందరు సాధువులు కూడా ఉంటారు. జ్ఞాని కూడా ఒక్కొక్కప్పుడు గెంతుతాడు, చప్పట్లు కొడతాడు. ఒకనికి బుద్ధి పనిచేసినా నాస్తికుడై యుంటాడు. అతడొక రకం అజ్ఞాని. తిరువణ్ణామలైలో శేషాద్రిస్వామియనే జ్ఞాని యుండేవాడు. అతడు వచ్చేవారిపై రాళ్ళు విసిరేవాడు. - దీనిని ఆశీర్వచనంగా జనులు భావించేవారు, బుద్ధిలేనివాడొకడుండగా, బుద్ధిని అణచినవాడొకడు, గెంటివేసిన వాడొకడుంటారు.  


కాని పిచ్చివాళ్ళకు, మూర్ఖులకు మానిసిక క్షోభ ఉంటుంది. కాని జడునిగా కన్పించే జ్ఞానికి చిత్తశాంతి యుంటుంది. ఎప్పుడూ ఆనందంతో ఉంటాడు. ఇక నాస్తికుడైన అజ్ఞానికి మనమేదైనా హాని తలబెడితే నూరు రెట్లు మనకు హాని చేస్తాడు. కాని జ్ఞానిని, వాతలు పెట్టినా చిరునవ్వుతో మనలనాశీర్వదిస్తాడు. హానిలోనూ ఆనందాన్ని ప్రకటిస్తాడు. అతడు పిచ్చివానిగా, జడునిగా, మూర్ఖునిగా, నాస్తికునిగా పైకి కన్పిస్తాడు.


No comments:

Post a Comment