Saturday 8 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 215 వ భాగం



శంకరుల ఉపదేశ సారాంశం: 


వేదాలలో చెప్పిన కర్మలను అనుసరించవలసిందే. దేనికోసం! చిత్తశుద్ధి కోసం. కేవలం అనుష్ఠానమే లక్ష్యమని మీమాంసకులంటారు. వారు పొందే స్వర్గాది సుఖాలు కూడా నిత్యం కావని, ఆత్మను తెలిసికోవడమే అంతిమ లక్ష్యమని శంకరులున్నారు.


వేదంలో చెప్పిన కర్మకాండకే మీమాంసకులు ప్రాధాన్యం ఇచ్చారుగాని అందలి జ్ఞాన కాండను తడమరు. అయితే అది ఎందుకుందని వారిని ప్రశ్నిస్తే వాటిని అర్ధవాదాలంటారు. అనగా వేదంలోని విధి నిషేధ వాక్యాలను బలపరచి బోధించడానికి నిందా రూపంలో గాని స్తుతి రూపంలోగాని చేసే వివరణ, అర్ధవాదం. అనగా స్తుతిగాని, నిందగాని యోజనంగాగల లౌకిక వాక్యం. జ్ఞాన కాండ గురించి వీరేమంటారంటే నీవు దేవుడవవుతావని, కర్మలను ప్రోత్సహించినట్లే ఆ మాటలుంటాయని అర్ధం చెబుతారు.


శంకరుల ఉపదేశ సారాంశం: శంకరులు కర్మలను కర్మల కొరకే చేయడం లేదని, స్వర్గాది సుఖాల కోసం చేస్తున్నారని అన్నారు. కర్మకాండ ఇది చేయి ఇవి చేయి అని అంటే, ఏది చేయకూడదో అది వద్దని జ్ఞానకాండ చెబుతోంది. వేదంలో సత్యం పలుకుమని విధి వాక్యం ఎట్లా ఉందో పరదార సంగమం వద్దనీ ఉంది. చేయకూడని వాటిని ఎట్లా చేయకుండా ఉంటున్నామో అనగా అక్కడ నిష్క్రియత్వం ఎట్లా ఉందో అట్లాగే చివరి దశలో అనగా జ్ఞాన దశలో నిష్క్రియంగా ఉండడమే అద్వైతలక్ష్యమని శంకరులన్నారు. ఆత్మ సుఖం కోసం అన్నిటినీ విడిచి పెట్టాలని వీరంటారు. అటువంటప్పుడు జ్ఞానకాండ, ఎట్లా అర్ధవాదమౌతుంది? కర్మవల్ల వచ్చే ఫలాన్ని, జ్ఞానం వల్ల వచ్చే ఫలాన్ని బేరీజు వేసుకోవద్దా? కర్మల వల్ల వచ్చే సుఖం తాత్కాలికం. జ్ఞానం వల్ల ఆత్మానందం కల్గుతుంది. అది శాశ్వతం. ముందుగా కర్మలను చిత్తశుద్ధికై చేయాలి. ఇది చిక్కిన తరువాత వాటిని విసర్జించాలని వేదాంతులంటారు.


ఆపైన మీమాంసకులు కర్మయే ఫలమిస్తుందని, దేవునితో నిమిత్తం లేదని అంటారు. ఈ సమస్త ప్రపంచం ఒక నియతితో సాగుతోందని, దీనిని నడిపేవాడున్నాడని, కర్మలకు తగిన ఫలమిస్తాడని వేదాంతులంటారు. కర్మ ఫలాలనాశించకుండా కర్మలను చేయాలని, ఫలాలను స్వామికి అర్పించాలని, చిత్తశుద్ధిని ప్రసాదింపుమని ప్రార్ధించాలని వేదాంతులంటారు.


No comments:

Post a Comment