ఇక వాదానికి కూర్చున్నారు. మధ్యవర్తి ఉండాలి కాబట్టి ఇతని భార్యయైన సరసవాణియే మధ్యవర్తినిగా ఉంచారు. మండనుడు, బ్రహ్మయని, ఆమె సరస్వతీయని శంకరులకు తెలుసు. కనుక సరస్వతి మాట శిరోధార్యమే. తన భర్త ఓడిపోయాడన్నా తనకి ఇబ్బందియే, సన్న్యాసి గెలిచాడని గట్టిగా చెప్పగలదా? వారిద్దరి మెడలలో పూలమాలికలను వేసి ఏది వాడిపోతే అతడోడినట్లని నిర్ణయించింది.
శంకరులు ఓడిపోతే మరల గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలని, మండనుడు ఓడిపోతే సన్యాసం పుచ్చుకోవాలని నియమం పెట్టుకున్నారు. వాదం మొదలైంది. రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా 21 రోజులు చర్చ జరిగింది.
శంకరులు అద్వైతాన్ని ప్రతిపాదించారు. కొన్ని వేద మంత్రాలను ఆధారంగా వీరిని ఖండించడం సబబు కాదు. ఎవడగ్నులను ఆరాధించకుండా ఉంటాదో అతనికి వీరహత్యాదోషం వస్తుందనే తైత్తిరీయ మంత్రాన్ని వీరిపట్ల అన్వయించకూడదు. ఎవడు వైదిక కర్మలను విడిచిపెట్టాడో అట్టివానికి ఆ మంత్రం అన్వయిస్తుంది. అట్టివారిని కర్తవ్యోన్ముఖ్యులను చేయడం కోసం అట్టి మంత్రాలున్నాయి. ఇక నివృత్తి మార్గంలో శంకరులు ఉన్నారు. బాహ్యమైన అగ్నిని విడిచి జ్ఞానాగ్నితో నిరంతరం వెలుగొందుతూ ఉన్నారు. ఒక పచ్చి కాయ, పండు కావడం రంగు రుచి మారడం జరిగి పక్వమైన తరువాత క్రిందబడితే మరల చెట్టునకు తగిలిస్తారా? అదేవిధంగా, జ్ఞానం పండేదాకా కర్మలు చేస్తూ ఉండవలసిందే. పండు పక్వానికి (పూర్తిజ్ఞానం) వచ్చిన తరువాత కర్మలు తమంత తామే తొలగిపోతాయి. ఇట్టి జ్ఞానం కలిగినవారు అన్నిటినీ సమంగా చూడగలరు. ప్రేమతో చూస్తారు. తరువాత నిష్క్రియులై యుంటారు. సర్వభూతములు, తననుండి భయం లేకుండా ఉండుగాక అని వారు ప్రైష మంత్రాన్ని పలికినవారు కదా.
మండునుడు అద్వైతాన్ని పూర్తిగా అంగీకరించాడు. ఇతని మెడలో పూలమాల వాడిపోయింది. ఇక ఇతనిలో సగభాగమైన ఆమె ఊరుకొంటుందా? ఆమె కూడా అంగీకరించింది. తల ఒగ్గింది. ఆమె అంగీకరించడం ఎటువంటి దంటే వసిష్ఠుడు తనను బ్రహ్మర్షియని పిలవాలని విశ్వామిత్రుడన్నట్లుగా భావించాలి.
శంకరులు, సర్వజ్ఞ పీఠారోహణం చేసినపుడు సరస్వతి ప్రత్యక్షమై వీరిని సర్వజ్ఞులని చెప్పినట్లున్న కథ కూడా ఉంది.
No comments:
Post a Comment